(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): వృద్ధాప్యంలో కంటిచూపు సమస్యలు పెరుగుతాయి. కాటరాక్ట్ వంటి సాధారణ ఆపరేషన్లు, కండ్లజోడుతో కొంతవరకూ ఈ సమస్యలను దూరం చేయవచ్చు. అయితే, వృద్ధుల్లో అరుదుగా కనిపించే ఏజ్-రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ (ఏఎండీ)తో ఒకసారి కంటిచూపు పోతే, తిరిగి తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు. ఏఎండీతో బాధపడేవారు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది వరకూ ఉన్నారు.
కానీ, ఏఎండీతో బాధపడే వారికి కూడా ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్ చిప్‌తో, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏజీ) గ్లాసెస్‌తో కంటిచూపు తిరిగి తీసుకురావచ్చని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఏఎండీతో బాధపడే 32 మంది రోగులపై ఈ ప్రయోగాలు చేస్తే, 27 మంది రోగులు స్పష్టంగా అక్షరాలు చదివారని, చిత్రాలను గుర్తించారని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం రోగులకు అన్ని చిత్రాలు తెలుపు-నలుపు చిత్రాలుగానే కనిపిస్తాయని, తర్వాతి దశల్లో తాము చిప్‌నకు మరిన్ని మెరుగులు దిద్దుతామని, అప్పుడు పూర్తి రంగుల్లో రోగులు అన్నింటినీ చూడగలరని తెలిపారు. తాము అభివృద్ధి చేసిన చిప్ మందం వెంట్రుకలో సగంకూడా ఉండబోదని పేర్కొన్నారు.