మెనోపాజ్ అంటే అది స్త్రీకి సంబంధించిన విషయమే అని ఇప్పటివరకూ మనకు తెలుసు. అయితే, పురుషుల్లోనూ మెనోపాజ్ దశ ఉంటుందని మీకు తెలుసా? మగవారు కూడా ఈ దశను ఫేస్ చేస్తారని మీరెప్పుడైనా విన్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రముఖ వైద్యుల అధ్యయనంలో పురుషుల మెనోపాజ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మహిళల్లాగే 40 ఏండ్లు దాటిన పురుషుల్లో మెనోపాజ్ దశను గుర్తించారు. మగవారిలో ఏటా టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల ఈ విపరీత పరిస్థితి ఎదురవుతున్నట్టు తేల్చారు.
ఇది నిశ్శబ్ద మహమ్మారిలా పురుషులను బలహీనపరుస్తున్నది. ఒక్కసారిగా వారిలో నిస్సత్తువ ఆవహిస్తున్నది. అలాగే, మెనోపాజ్ వల్ల మగవారిలో అంగస్తంభన, మానసిక ఒత్తిడి సమస్యలు తీవ్రం కావడంతోపాటు అధికంగా బరువు పెరిగిపోతున్నారు. ఈ మేల్ మెనోపాజ్‌ను వైద్య పరిభాషలో ‘ఆండ్రోపాజ్’ అని పిలుస్తున్నారు. ఈ దశలో స్త్రీలలోలాగా పురుషుల్లో హార్మోన్ స్థాయిలు ఒకేసారి పడిపోకుండా క్రమపద్ధతిలో తగ్గుతుంటాయి. ప్రతి ఏటా టెస్టోస్టిరాన్ స్థాయిలు ఒక శాతం మాత్రమే తగ్గుతాయి. అదే సమయంలో ఈ మేల్ మెనోపాజ్ అందిరిలోనూ కనిపించదు. కొంతమంది వృద్ధుల్లో ఈ టెస్టోస్టిరాన్ స్థాయిలు సాధారణంగానే ఉంటాయి.
– సెంట్రల్ డెస్క్
ఎలా గుర్తిస్తారు? చికిత్స ఉంటుందా?
రక్త పరీక్షల ద్వారా పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలను గుర్తించొచ్చు. నిద్రలేచిన మూడు గంటల్లోపు ఈ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలోనే మగవారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. బాడీ ఐడెంటికల్ టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ ద్వారా పురుషుల్లో హర్మోన్ స్థాయిలను పెంచొచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ కాంప్‌బెల్ వెల్లడించారు. అలాగే, జీవన విధానంలో మార్పులతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చని సూచించారు. సరైన డైట్ పాటిస్తూ, ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడంతోపాటు నిత్యం వ్యాయామం, యోగా చేయాలని పేర్కొన్నారు.
50 ఏండ్ల తర్వాత మేల్ మెనోపాజ్
ప్రతి పురుషుడిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది. యుక్త వయసులో ఈ హార్మోన్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల వారి శరీరంలో విపరీతమైన మార్పులు కనిపిస్తాయి. కంఠం మారుతుంది. కండరాల పటుత్వం పెరుగుతుంది. శారీరక పరిమాణ వృద్ధికి టెస్టోస్టిరాన్ దోహదం చేస్తుంది. అలాగే, వృషణాలు పునరుత్పత్తికి కీలకమైన స్పెర్మ్‌ను తయారుచేయడంలో టెస్టోస్టిరాన్ తోడ్పడుతుంది. 20 ఏండ్ల వయస్సులో ఈ హార్మోన్స్ స్థాయిలు గరిష్ఠానికి చేరుకొంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతుంటాయి. 20 ఏండ్ల వయసులో పురుషుడిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు 300-1200 ఎన్జీ/డీఎల్ (నానోగ్రాం ఫర్ డెసిలీటర్) ఉంటాయి. ఆ తర్వాత నుంచి ఏటా కనీసం ఒక శాతం తగ్గుతూ ఉంటాయి. 50 ఏండ్ల వయసున్న పురుషుల్లో 12 శాతం, 60ల్లో 19 శాతం, 70ల్లో 28 శాతం, 80 ఏండ్ల వృద్ధుల్లో 49 శాతం మేర హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయని విస్కాన్సిన్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. తక్కువ టెస్టోస్టిరాన్ వల్ల హృద్రోగాలూ వస్తాయని పేర్కొన్నారు.
మేల్ మెనోపాజ్ లక్షణాలు
1. తీవ్రమైన అలసట
2. శారీరక సామర్థ్యం తగ్గిపోవడం
3. మానసిక ఆందోళన, మనో వ్యాకులత
4. అంగస్తంభన సమస్యలు, సెక్స్ కోరికలు తగ్గడం
5. ఎముకల సాంద్రత, కండరాల పటుత్వం తగ్గిపోవడం
6. ఆత్మవిశ్వాసం లోపించడం
7. ఉత్సాహం లేకపోవడం
8. శరీరంలో కొవ్వు పెరగడం
9. నిద్రలేమి
10. శరీరంపై రోమాలు రాలిపోవడం
11. వృషణాల పరిమాణంలో తగ్గుదల