న్యూఢిల్లీ: మహిళలపై జరిగే హింసకు విధించే శిక్షలు కఠినంగానే ఉన్నాయని కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. ఆ చట్టాల(Stringent Laws)ను అమలు చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆమె కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర మంత్రి రెండోసారి లేఖ కూడా రాశారు. వాస్తవానికి శుక్రవారం ఉదయం మమతా బెనర్జీ.. ప్రధాని మోదీకి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రెండో సారి లేఖ రాశారు. రేపిస్టులకు కఠిన శిక్ష వేయాలని ఆమె ఆ లేఖలో కోరారు. ఆ లేఖపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ స్పందించారు.
రేప్, పోక్సో కేసులను డీల్ చేసేందుకు ఏర్పాటు చేసిన 11 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులను బెంగాల్ సర్కారు ఆపరేట్ చేయడం లేదని కేంద్ర మంత్రి తన లేఖలో ఆరోపించారు. బెంగాల్ ప్రభుత్వం 88 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిందని, కానీ అవి కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌లో భాగంగా నడిచే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల తరహాలో పనిచేయవని మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో 48,600 రేప్, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అదనపు 11 ఎఫ్‌టీఎస్‌సీలను రాష్ట్రం ఆపరేట్ చేయలేదని మంత్రి తన లేఖలో దీదీకి తెలిపారు.