లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఖజానాలోని డబ్బు చల్లటి వాతావరణంలో కూడా వారిని వెచ్చగా ఉంచుతున్నదని విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఇటీవల మొరాదాబాద్‌లోని అలీగఢ్ నుంచి ఉన్నావ్ వరకు జన్ విశ్వాస్ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆమె (మాయావతి) ప్రచారానికి రావడంలేదు. బహన్‌జీ (సోదరి) భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నది. అందుకే చలి వల్ల బయటకు రావడం లేదు’ అని విమర్శించారు.
కాగా, మీడియాతో మాట్లాడిన మాయావతి దీనికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలో లేదా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తారని ఆరోపించారు. ‘పేదల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ ఖజానాలోని డబ్బు వారిని వెచ్చగా ఉంచుతోంది. కానీ, ఈ పార్టీలు అధికారంలో లేనప్పుడు, వారు మనలాగే ఉన్నారు. ఎన్నికలకు ముందు వారు బహిరంగ సభలు నిర్వహించరు. ప్రారంభోత్సవాలకు హాజరుకారు. శంకుస్థాపనలు చేయరు’ అని మండిపడ్డారు. తమ పార్టీ ప్రచార స్టైలు వేరని, దీనిని ఎవరూ కాపీ కొట్టలేరని అన్నారు. తమ పార్టీ గురించి ఇతర పార్టీలు లేదా మీడియా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.