న్యూఢిల్లీ : పార్టీలు, సంబురాల సందర్భంగా చాలా మంది ఆల్కహాలిక్ పానీయాలను తాగుతూ గడుపుతారు. రాత్రివేళ స్నేహితులతో కలిసి అతిగా మద్యాన్ని సేవించడం వల్ల డీహైడ్రేషన్ నుంచి అలసట వరకు అనేక రుగ్మతలు వేధిస్తాయి. ఆల్కహాల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గురించి అందరికీ తెలుసు. తాము ఓ మోస్తరుగా మాత్రమే తాగుతామని అనుకునేవారు కూడా ఆల్కహాల్ సామర్థ్యం గురించి తెలుసుకోవాలి. ఇటువంటి వారి పేగుల గోడలు కూడా బలహీనపడతాయని, కాలక్రమంలో జీర్ణశక్తి దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్: క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్’లో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక ప్రకారం, ఒకేసారి రెండు గంటల పాటు అతిగా మద్యాన్ని సేవించడం వల్ల గట్ లైనింగ్ (పేగుల లోపలి పొర) దెబ్బ తింటుంది.
పురుషులకు 5 డ్రింక్‌లు, స్త్రీలకు 4 డ్రింక్‌లను తాగడం అతిగా మద్యం సేవించడమవుతుంది. హార్వర్డ్ అండ్ బేట్ డెకోనెస్ మెడికల్ సెంటర్ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ విధంగా మద్యాన్ని సేవించడం వల్ల లీకీ గట్‌కు దారి తీస్తుంది. అంటే, రక్త ప్రవాహం లోకి బ్యాక్టీరియాను లేదా విషపూరిత పదార్థాలను ప్రవేశించకుండా నిరోధించడం కష్టమవుతుంది. ఈ లీక్‌లు ఎక్కువసేపు నిర్నిరోధంగా కొనసాగితే, చివరి డ్రింక్‌ను తాగిన తర్వాత బాధాకరమైన మంట పుడుతుంది. న్యూట్రోఫిల్స్ అనే రోగ నిరోధక కణాలు సాలెగూడు వంటి నిర్మాణాలను విడుదల చేస్తాయి. ఈ నిర్మాణాలు చిన్న పేగులను దెబ్బ తీస్తాయి. రక్షణ వ్యవస్థను బలహీనపరుస్తాయి. ఫలితంగా బ్యాక్టీరియల్ టాక్సిన్స్ రక్త ప్రవాహంలోకి జారుకుంటాయి. ఈ నిర్మాణాలను అడ్డుకోవడానికి శాస్త్రవేత్తలు ఓ సాధారణ ఎంజైమ్‌ను ఉపయోగించి, సత్ఫలితాలను సాధించారు.