ఇటానగర్: హర్యానాకు చెందిన అభ్యర్థులు అరుణాచల్ ప్రదేశ్‌లోని సెంటర్లలో పోటీ పరీక్షలు రాశారు. సుమారు 2,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరికి హర్యానా నుంచి కొందరు సహాయం చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సమాధానాలు చెప్పారు. ఒక అభ్యర్థి అనుమానాస్పద ప్రవర్తనతో ఈ హైటెక్ మాస్ చీటింగ్ బయటపడింది. (mass exam cheating) దీంతో హర్యానాకు చెందిన 53 మంది అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 18న జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నియామక పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహించింది.
కాగా, హర్యానాకు చెందిన కొందరు అభ్యర్థులు అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌ని పరీక్షా కేంద్రాలను ఎంచుకున్నారు. వారు అక్కడకు చేరుకుని పరీక్షలకు హాజరయ్యారు. మే 18న సాయంత్రం ల్యాబ్ అటెండెంట్ పరీక్ష సమయంలో కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్లో ఒక అభ్యర్థి అనుమానాస్పద ప్రవర్తనను సిబ్బంది గమనించారు. అతడ్ని చెక్ చేయగా లోదుస్తుల్లో దాచిన చిన్న ఎలక్ట్రానిక్ పరికరం, చిన్న ఇయర్‌పీస్ దొరికాయి. దీంతో పోలీసులను రప్పించారు. అభ్యర్థులందరినీ తనిఖీ చేయగా హర్యానాకు చెందిన 23 మంది వద్ద ఇలాంటి పరికరాలు లభించాయి. దీంతో వారిని అరెస్ట్ చేశారు.
మరోవైపు వివేకానంద కేంద్ర విద్యాలయంలో మరో అనుమానితుడిని పోలీసులు పట్టుకున్నారు. దర్యాప్తు తర్వాత మిగిలిన నిందితులను అరెస్ట్ చేశారు. ఉదయం జరిగిన ఇతర పరీక్షలకు హాజరైనా అభ్యర్థుల వద్ద కూడా ఇలాంటి పరికరాలు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. హోటల్స్‌తోపాటు ఇతర ప్రదేశాల్లో ఉన్న హర్యానాకు చెందిన మొత్తం 53 మంది అభ్యర్థులను అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Electronic Devices
కాగా, ఇటానగర్‌లో పోటీ పరీక్షలు రాసిన ఈ అభ్యర్థులకు 2,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానా నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సమాధానాలు అందాయని పోలీస్ అధికారి తెలిపారు. జీఎస్ఎం ఆధారిత గాడ్జెట్లు, మైక్రో ఇయర్‌పీస్‌లు, అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించి హర్యానా అభ్యర్థులు పరీక్షల్లో హైటెక్ మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. 29 పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రశ్నాపత్రం లీకైనట్లు అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు నాగాలాండ్‌లోని దిమాపూర్, సిక్కిం, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ పరీక్షా కేంద్రాల్లో కూడా ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో ఈ హైటెక్ మాస్ కాపీయింగ్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 2,600 కిలోమీటర్ల దూరం నుంచి దీనికి నేతృత్వం వహించిన హర్యానా సూత్రధారి, వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు వివరించారు. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న విస్తృత నెట్‌వర్క్‌ను గుర్తించడానికి అంతర్రాష్ట్ర పోలీసులతో కలిసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.