Mass Copying | న్యూఢిల్లీ, మే 22: అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన ఒక పరీక్షలో మాస్ కాపీయింగ్ వెలుగులోకి వచ్చింది. ఎక్కడో ఇటానగర్‌లో ఉంటూ హర్యానాలోని జింద్ నుంచి సమాధానాలు పొందే విధంగా ప్లాన్ చేసుకున్న 53 మంది అభ్యర్థులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మాస్ కాపీయింగ్ వెనుకున్న మాస్టర్‌మైండ్ కోసం పోలీసులు వెదుకుతున్నారు.
మాస్ కాపీయింగ్ 2,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానా నుంచి ఆపరేట్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మే 18న సీబీఎస్ఈ నవోదయ విద్యాలయాల్లో నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో ఈ మాస్ కాపీయింగ్ చోటుచేసుకుంది. ఎగ్జామ్ సెంటర్లోని ఓ అభ్యర్థి అధునాతన ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, మైక్రో ఇయర్‌పీస్‌ను వాడుతూ ఇన్విజిలేటర్‌కు దొరికిపోయాడు. అతడి నుంచి పోలీసులు మరింత సమాచారాన్ని రాబట్టగా 53 మంది గుట్టు రట్టు అయ్యింది.