Ex vice president : ఒక పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు మరో పార్టీకి మారినప్పుడు తమ పదవులకు రాజీనామా చేయాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి (Ex vice president of India) వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అభిప్రాయపడ్డారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు పదవికి రాజీనామా చేసేలా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
పార్టీ మారిన తర్వాత కొంతమంది మంత్రులు కూడా అవుతున్నారని, ఇది చట్ట వ్యతిరేకమని వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తంచేశారు. చట్టానికి అతీతంగా ఎవరూ వ్యవహరించకూడదని అన్నారు. అదేవిధంగా ప్రజలకు అందించే ఉచిత పథకాలు పరిధి దాటుతున్నాయని విమర్శించారు. ఇలాంటి పథకాల కోసం ప్రభుత్వాలు తాహతుకు మించి అప్పులు చేస్తున్నాయని చెప్పారు.
అప్పులు తీసుకువచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఆ అప్పులను ఎలా తీర్చబోతున్నారనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని వెంకయ్య నాయుడు సూచించారు. అందుకోసం అసెంబ్లీలో చర్చించాలని అన్నారు.