న్యూఢిల్లీ: మాజీ రవాణా శాఖ మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లార్(Minister Laljit Singh)ను పంజాబ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పంజాబ్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ గగన్‌దీప్ సింగ్ రాంధ్వా ఆత్మహత్య కేసులో ఆ అరెస్టు చేశారు. శనివారం గగన్‌దీప్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ముందు లొంగిపోనున్న విషయాన్ని మాజీ మంత్రి భుల్లార్ తొలుత తన ఫేస్బుక్ పోస్టులో వెల్లడించారు. చట్టంపై నమ్మకం ఉందని, న్యాయవ్యవస్థను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నేనేక్కడికి పారిపోలేదని, పంజాబ్‌లోనే ఉన్నానన్నారు. మండి గోబింద్ఘర్ పోలీసు స్టేషన్లో లొంగిపోతున్నట్లు చెప్పారు. ఓ పని కోసం టెండర్లను తమకు చెందిన వ్యక్తులకు ఇవ్వాలని మాజీ మంత్రి భుల్లార్ తనను వేధిస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మేనేజర్ రాంధ్వా శనివారం సోషల్ మీడియాలో ఓ వీడియోను అప్లోడ్ చేశారు. విషం తాగి ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు చెందిన వీడియో కూడా వైరల్ అయ్యింది. భుల్లార్‌ను రాజీనామా చేయాలని ఆదేశించినట్లు శనివారమే సీఎం భగవంత్‌మాన్ ప్రకటించారు.