ముంబై, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఓ యువతి పెండ్లి కాకుండానే గర్భవతి అయింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ సమాజం కట్టుబాట్లకు భయపడి.. ఆ పుట్టిన బిడ్డను 3 రోజులకే తీసుకెళ్లి దగ్గరలో ఉన్న ఓ అనాథాశ్రమంలో వదిలేసింది. పెరిగి పెద్దవాడైన ఆ బాలుడే నెదర్లాండ్స్‌లోని హీమ్ స్టెడ్ నగర మేయర్ అయ్యాడు. అతడే ఫాల్గుణ్ బిన్నెండిక్. అయితే ఉన్నత పదవిని అధిష్ఠించినా తనకు జన్మనిచ్చిన తల్లి ఎవరో తెలుసుకోవాలని.. ఆమెను కలుసుకోవాలని అతడు ఆరాటపడేవాడు. ఇందుకోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వచ్చి.. ఇప్పటికే రెండు సార్లు తన తల్లి గురించి వెతికాడు.
తనకు పేరు పెట్టిన నర్సు ఆచూకీ దొరకడంతో తన తల్లిని చూసినంత ఆనందపపడ్డాడు. ఫాల్గుణ్ బిన్నెండిక్క్ కథ ఒక సినిమాను తలపిస్తుంది. 1985 ఫిబ్రవరి 10న నాగ్‌పూర్‌లో పుట్టిన ఫాల్గుణ్ బిన్నెండిక్క్ను ఆమె తల్లి మూడు రోజుల పసికందుగా ఉన్నప్పుడే నాగ్‌పూర్‌లోని మాతృసేవా సంఘ్ అనే అనాథాశ్రమంలో వదిలేసింది. కొన్ని వారాల తర్వాత ఒక డచ్ జంట ఫాల్గుణ్ను దత్తత తీసుకుని నెదర్లాండ్స్‌కు తీసుకెళ్లారు. ఆయనే తర్వాత హీమ్ స్టెడ్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. గత ఏడాది నర్సును కలుసుకున్నాడు. మహాభారతంలోని కర్ణుడి పాత్ర తనకు చాలా ఇష్టమని ఫాల్గుణ్ చెప్పారు.