న్యూఢిల్లీ: కనీస పింఛను పెంచాలన్న ఈపీఎస్ పింఛనుదారుల దీర్ఘకాల డిమాండు బుధవారం మరోసారి పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చింది. ఎన్సీపీ(శరద్‌పవార్) సభ్యుడు గోపీనాథ్ బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
ఉద్యోగుల భవిష్యత నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) పరిధిలోని ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్) కింద పింఛన్‌దారులకు ప్రస్తుతం అందచేస్తున్న కనీస పింఛను రూ.1,000ని రూ.7,500కి పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందా? ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ ఈపీఎస్ పింఛనుదారులకు కరవు భత్యం ఎందుకు ఇవ్వడం లేదు? అని సభ్యుడు అడిగిన ప్రశ్నలకు మం త్రి జవాబిస్తూ కనీస పింఛనును పెంచే ప్రతిపాదనేదీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని తెలిపారు. ఈపీఎస్ నిధి ఆర్థికపరమైన లోటును ఎదుర్కొంటున్నదని ఆమె తెలిపారు. కనీస పింఛను పెంచడం వల్ల ఈపీఎస్ నిధిపై మోయలేని భారం పడుతుందని పేర్కొన్నారు. పింఛనుదారులకు కరవు భత్యాన్ని ఇవ్వడంపైనా ఎటువంటి హామీ ఇవ్వలేదు.
ప్రైవేట్, సంఘటిత రంగానికి చెందిన ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న పింఛను పథకం ఈపీఎస్-95. 1995లో ప్రవేశపెట్టిన ఈ పథకం కింద 80 లక్షల మందికి పైగా పింఛనుదారులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం కోసం ఉద్యోగుల వేతనంలో 8.33 శాతాన్ని సంస్థ యాజమాన్యం అందచేస్తుండగా కేంద్రం 1.16 శాతాన్ని (రూ. 15,000 వేతన సీలింగ్ వరకు) అందచేస్తుంది. వృద్ధాప్యంలో రిటైర్డ్ ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పథకం ఉద్దేశించినప్పటికీ 2014లో ప్రవేశపెట్టిన రూ. 1,000 కనీస నెలవారీ పింఛను వల్ల పెరుగుతున్న ధరలకు ఇది ఏమాత్రం సరితూగడం లేదు. నెలవారీ కనీస పింఛనును రూ. 7,500-9,000 పెంచాలని పింఛనుదారులు డిమాండు చేస్తున్నారు.