న్యూఢిల్లీ: భారత్లో 2050 నాటికి వృద్ధుల జనాభా రెట్టింపు కావొచ్చని జనాభా కార్యక్రమాల ఐరాస నిధి(యూఎన్ఎఫ్పీఏ) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం, ఇండ్లు, పెన్షన్లపై ఎక్కువ పెట్టుబడులు అవసరమని ఆ సంస్థ ఇండియా చీఫ్ ఆండ్రియా వొజ్నర్ తెలిపారు. ఒంటరిగా నివసిస్తూ పేదరికం ఎదుర్కొనే మహిళలను ఆదుకోవడానికి ఈ చర్యలు అవసరమని ఆమె తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆమె ఇటీవల పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్లో 2050 నాటికి 60 ఏండ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య 34.60 కోట్లకు చేరుకోవచ్చని ఆమె అంచనా వేశారు.
కార్పొరేట్ సంస్థలతో ఐసీఏఆర్ ఒప్పందాలపై అభ్యంతరాలు
బెంగళూరు, జూలై 21: అమెజాన్, బేయర్, సింజెంటా వంటి బడా కార్పొరేట్ సంస్థలతో పలు ఒప్పందాలు చేసుకోవాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) నిర్ణయం తీసుకోవడంపై రైతులు, వ్యవసాయ, పర్యావరణ శాస్త్రవ్తేతలు, నిపుణులు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. విస్తృత సంప్రదింపులు లేకుండా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, దీని వలన రైతుల హక్కులు దెబ్బతింటాయని విమర్శిస్తున్నారు. కార్పొరేట్ సంస్థతో ఒప్పందాలు రద్దు చేయాలని, అలాంటి నిర్ణయాలకు సంబంధించిన అన్ని వివరాలను బహిర్గతం చేయాలని ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ హిమాన్షు పాథక్కు రాసిన లేఖలో పలువురు విద్యావేత్తలు, పర్యావరణవేత్తలు డిమాండ్ చేశారు. విషపూరిత ఉత్పత్తుల వ్యాపారంతో అపఖ్యాతి పాలైన ఓ కంపెనీతో సహా పలు ప్రైవేటు కార్పొరేషన్లతో జట్టు కట్టేందుకు ఐసీఏఆర్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఈ లేఖపై 451 మంది సంతకాలు చేశారు.