చండీగఢ్: దీపావళి రోజున కొందరు యువకులు పటాకులు పేల్చడంపై ఒక వృద్ధుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అర్ధరాత్రి తర్వాత వారు మళ్లీ క్రాకర్స్ కాల్చడంపై అతడు మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు యువకులు ఆ వ్యక్తిని కొట్టి చంపారు. (Elderly Man Beaten To Death) దీంతో పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. గురువారం రాత్రి దీపావళి సందర్భంగా ఫరీదాబాద్ సెక్టార్ 18లోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు ఒక ఇంటి ముందు బాణసంచా పేల్చారు. పెద్ద వయసున్న వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం జరిగింది.
కాగా, అర్ధరాత్రి తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు మళ్లీ ఆ ఇంటి ముందు పటాకులు కాల్చారు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన వృద్ధుడు దీనిపై మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ఆ వృద్ధుడ్ని కొట్టారు. జోక్యం చేసుకున్న అతడి కుమారుడు, కోడలు పట్ల దురుసుగా ప్రవర్తించారు.
మరోవైపు ఆ వ్యక్తులు కొట్టిన దెబ్బలకు తాళలేక ఆ వృద్ధుడు మరణించాడు. దీంతో అతడి కుమారుడు వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు రాజు, ధీరజ్, నందు కోసం పోలీసులు వెతుకుతున్నారు.