ముంబై, సెప్టెంబర్ 4 : బలపడుతున్న ఎల్ నినో ప్రభావంతో సెప్టెంబర్లో వర్షపాతం సగటు కంటే తక్కువగా, ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. గత మూడు దశాబ్దాలలోనే ఇది అత్యంత బలహీనమైన రుతుపవన కాలంగా మారవచ్చు. రుతుపవన వర్షాలు బలహీనంగా ప్రారంభం కావడం, నేలలో తగినంత తేమ లేకపోవడం వల్ల పత్తి, సోయాబీన్, మక్క, వరి వంటి ఖరీఫ్ పంటల సాగు ప్రక్రియలో జాప్యం జరిగింది. ఆగస్టులో సగటు కంటే తక్కవ వర్షపాతం కారణంగా ఈ పంటలు ఇప్పటికే తేమ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కాయలు ఏర్పడటం, గింజలు నిండటం వంటి కీలక దశలోకి ప్రవేశిస్తున్నాయి. సెప్టెంబర్ వరకు సగటు కంటే తక్కువ వర్షపాతం కొనసాగితే దిగుబడి తగ్గే అవకాశం ఉంది.
సాధారణంగా సెప్టెంబర్ 17 ప్రాంతంలో భారతదేశ వాయవ్య ప్రాంతం నుంచి రుతుపవనాలు వెనక్కి తగ్గడం మొదలై అక్టోబర్ మధ్య నాటికి పూర్తిగా ఉపసంహరించుకుంటాయి. అదే సమయంలో రైతులు గోధుములు, ఆవాలు, మక్క, శనగలు వంటి శీతాకాలపు పంటల సాగును ప్రారంభిస్తారు. సెప్టెంబర్ నెల వర్షపాతం నేలలోని తేమను నిర్ధారిస్తుంది. తేమ తక్కువగా ఉండటం విత్తనాల మొలకకు, పంట ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. కొన్ని రాష్ర్టాల్లో నేలలో తేమ సాధారణం కంటే తక్కువగా ఉంటే రైతులు దిగుబడి నష్టాలను, తక్కువ ఆదాయాలను చవిచూడవచ్చు.