ముంబై: డిప్యూటీ సీఎం రేస్‌లో తాను లేనని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే (Shrikant Shinde) స్పష్టం చేశారు. దీని గురించి వస్తున్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు. అధికారంపై తనకు ఎలాంటి కోరిక లేదని, తాను ఏ మంత్రి పదవి రేసులో లేనని అన్నారు. సోమవారం ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యం గురించి ప్రస్తావించారు. దీనిపై చాలా పుకార్లు ఉన్నాయని అన్నారు. ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనారోగ్య కారణాలతో రెండు రోజులు గ్రామానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. కాబట్టి పుకార్లు విజృంభించాయి. ఉప ముఖ్యమంత్రిని నేనే అనే వార్తలు గత రెండు రోజులుగా వ్యాపిస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. డిప్యూటీ సీఎం పదవికి సంబంధించిన వార్తలన్నీ నిరాధారమైనవి’ అని పేర్కొన్నారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయ్యే అవకాశం తనకు వచ్చిందని శ్రీకాంత్ షిండే తెలిపారు. అయితే పార్టీ కోసం పని చేయాలని భావించి మంత్రి పదవిని నిరాకరించినట్లు చెప్పారు. అధికారంలో ఉండాలనే కోరిక తనకు ఎప్పుడూ లేదన్నారు. ‘రాష్ట్రంలో మంత్రి పదవి రేసులో నేను లేనని మరోసారి స్పష్టం చేస్తున్నా. నా లోక్‌సభ నియోజకవర్గం, శివసేన కోసం మాత్రమే నేను పని చేస్తా’ అని అన్నారు.