Shrikant Shinde : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో వేడి రాజుకుంది. అన్ని పార్టీల నేతలు వ్యూహ రచనల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) కుమారుడు శ్రీకాంత్ షిండే (Shrikant Shinde) పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలోని గర్భగుడిలోకి ఆయనను అనుమతించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దాంతో అధికారులు విచారణకు ఆదేశించారు. శ్రీకాంత్ శిండే థానే జిల్లాలోని కల్యాణ్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గురువారం సాయంత్రం ఆ ఆలయానికి వెళ్లారు. భార్యతో కలిసి గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేశారని ఆలయ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. సుమారు ఏడాది కాలంగా ఆ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశంపై నిషేధం ఉన్నా షిండేను లోపలికి అనుమతించడం విమర్శలకు దారితీసింది.
సామాన్యులు దైవ దర్శనం కోసం గంటల కొద్ది క్యూలో నిలబడి వేచిచూస్తుంటే.. వీఐపీలను మాత్రం నిషేధం ఉన్నా గర్భగుడిలోకి అనుమతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ వ్యవహారం నిబంధనలకు విరుద్ధమని మండిపడింది. ఉజ్జయిని జిల్లా కలెక్టర్, ఆలయ కమిటీ ఛైర్మన్ నీరజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. తాము ఎవరినీ గర్భగుడిలోకి అనుమతించలేదని చెప్పారు. అలాంటిదేమైనా జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించానని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.