న్యూఢిల్లీ, అక్టోబర్ 17: దేశంలో రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. గురువారం అస్సాంలో ‘లోకమాన్య తిలక్’ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని సమాచారం.
అగర్తల నుంచి ముంబైకి బయల్దేరిన ఎక్స్ప్రెస్ రైలులోని 8 బోగీలు దిబాలాంగ్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పాయని రైల్వే అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. ‘రైలు పవర్ కార్ సహా 8 కోచ్లు పట్టాలు తప్పాయి.
ప్రయాణికులు ఎవ్వరూ గాయపడలేదు’ అని నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ అధికారి ఒకరు చెప్పారు. ఘటనాస్థలానికి సహాయక బృందాలు, మెడికల్ బృందం వెళ్లినట్టు తెలిపారు. ఘటనాస్థలం వద్ద రైల్వే లైన్ పునరుద్ధరణ పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు.