కోల్‌కతా: టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయిన పశ్చిమబెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ (Arpita Mukherjee) ఇంట్లో మరోసారి భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈడీ అధికారులు గత శుక్రవారం ఆమె ఇంట్లో సోదాలు జరుపగా రూ.21 కోట్లు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి దాడులు నిర్వహించగా భారీ మొత్తంలో డబ్బు, బంగారం బయటపడటం కలకలం రేపింది.
బుధవారం మధ్యాహ్నం ఈడీ అధికారులు అర్పితా ముఖర్జీకి చెందిన మరో అపార్ట్మెంటులో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో భారీగా నోట్ల కట్టలు గుర్తించారు. దీంతో వాటిని లెక్కించేందుకు బ్యాంకు నుంచి యంత్రాలను తీసుకువచ్చారు. బుధవారం రాత్రి వరకు వాటిని లెక్కించిన అధికారులు.. మొత్తం రూ.29 కోట్లు ఉన్నట్లు తేల్చారు. అదేవిధంగా 5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో గత శనివారం మంత్రి పార్థా ఛటర్జీతో పాటు ఆమెనూ అరెస్టు చేశారు. వీరిద్దరికి కోర్టు వచ్చేనెల 3 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలో అర్పిత ఇంట్లో అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. కాగా, గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.21 కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో అక్రమంగా వచ్చిన డబ్బేనని అర్పితా ముఖర్జీ ఈడీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తున్నది. తన ఇంటిని ఓ బ్యాంకుగా మార్చుకున్నట్లు చెప్పిందని విస్వనీయ వర్గాలు వెల్లడించాయి.
ED
మంత్రి పార్ధా తన ఇంట్లో ఉన్న ఓ రూమ్‌లోనే డబ్బును మొత్తం దాచాడని అర్పిత తెలిపింది. ఆ రూమ్‌లోకి కేవలం పార్ధా మనుషులు మాత్రమే వెళ్లేవారని విచారణలో పేర్కొన్నది. తన ఇంటికి మంత్రి పార్థా.. వారానికి ఓ సారి లేదా పది రోజులకు ఓసారి వచ్చేవారని అర్పిత చెప్పింది. తన ఇంటితో పాటు మరో మహిళ ఇంటిని కూడా మినీ బ్యాంక్‌లా మంత్రి పార్థా వాడుకున్నట్లు తెలిపింది. మరో మహిళ కూడా మంత్రికి సన్నిహితురాలని అర్పిత వెల్లడించింది.
ఓ బెంగాలీ నటుడు తనను మంత్రి పార్థాకు పరిచయం చేయించాడని, 2016 నుంచి ఇద్దరి మధ్య పరిచయం ఉన్నట్లు ఆమె చెప్పారు. ట్రాన్స్ఫర్లు, కాలేజీ గుర్తింపు కోసం ఇచ్చిన లంచాలదే ఆ డబ్బు మొత్తం అని ఆమె తెలిపింది. కానీ ఆ డబ్బును మంత్రి ఎప్పుడూ తీసుకురాలేదని, అతని మనుషులు మాత్రమే తెచ్చేవారని ఆమె చెప్పింది.