చెన్నై: తమిళనాడులో (Tamil Nadu) అధికారపార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలపై సీఎం స్టాలిన్ కేబినెట్లోని మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా మరో మంత్రి ఇంటిపై దాడులు చేస్తున్నది. మనీలాండరింగ్ కేసులో (Money laundering case) రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కే.పొన్ముడి (K.Ponmudy)తోపాటు ఆయన కుమారుడు, కల్లకురిచి (Kallakurichi) ఎంపీ గౌతమ్ సిగమణి (Gautham Sigamani) ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైతోపాటు (Chennai) విల్లుపురంలోని ఈ దాడులు కొనసాగుతున్నాయి.
2007 నుంచి 2011 వరకు గనుల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్ముడి.. క్వారీ లైసెన్స్ షరతులు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ఖజానాకు సుమారు రూ.28 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసు విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు (Madras High Court) కొట్టివేసింది. కాగా, రాజకీయ వేధింపులలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ దాడులకు పాల్పడుతుందని డీఎంకే పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా, బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల కూటమి సమావేశానికి ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరుకానున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం విశేషం.