రాంచీ, ఆగస్టు 24: ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిర పర్చడానికి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నదని ఎన్ని ఆరోపణలు వచ్చినా బీజేపీ మాత్రం తన పంథాను వీడటం లేదు. అక్రమ మైనింగ్ కేసు పేరుతో జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
ఈ కేసులో ఇప్పటికే సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రా, బచ్చూయాదవ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. తాజాగా సీఎం సన్నిహితుడిగా భావిస్తున్న ప్రేమ్ ప్రకాశ్ లక్ష్యంగా ఈడీ బుధవారం సోదాలు జరిపింది. జార్ఖండ్, బీహార్, తమిళనాడు, ఢిల్లీలో దాదాపు 20 చోట్ల ఈ సోదాలు జరిగాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన సోదాల్లో రెండు ఏకే-47 తుపాకులు, 60 బుల్లెట్లు దొరికాయని అధికారులు చెప్పారు. ఈ తుపాకులు రాంచీ పోలీసులకు చెందినవని ప్రాథమికంగా తేల్చారు. అక్రమ మైనింగ్ కేసులో ఈడీ 4 నెలలుగా సోదాలు చేపడుతున్నది.