Earth | న్యూఢిల్లీ, జూలై 5: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ విశ్వాంతరాళంలో ఓ ప్రవాహం మాదిరి ముందుకు కదులుతుందన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం భూమి ఓ అంతుచిక్కని కృష్ణ పదార్థాన్ని దాటుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీంతో భూమి మీదనున్న ఐనో ఆవరణంలో కొత్త రేడియో తరంగాలు ఉద్భవిస్తున్నట్టు పేర్కొన్నారు. వీటిని లోతుగా విశ్లేషిస్తే, విశ్వం పుట్టుక, గమనం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ కృష్ణ పదార్థాన్ని ‘డార్క్ ఓషన్’గా వాళ్లు అభివర్ణిస్తున్నారు.
అంగారకుడిపై ఉల్కల దాడి
న్యూఢిల్లీ, జూలై 5: సౌరకుటుంబంలో జీవం ఆనవాళ్లు ఉండొచ్చని భావిస్తున్న అంగారక గ్రహానికి ఉల్కల బెడద ఎక్కువైనట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతీరోజూ ఆ గ్రహం మీద ఉల్కాపాతం జరుగుతున్నట్టు తెలిపారు. ప్రతీ ఏడాది బాస్కెట్‌బాల్ సైజులో ఉండే దాదాపు 280-360 ఉల్కలు అంగారకుడి మీద పడుతున్నట్టు పేర్కొన్నారు. దీంతో మార్స్ ఉపరితలంపై 26 అడుగుల వెడల్పుతో గుంతలు, చిన్న భూప్రకంపనలు సంభవిస్తున్నట్టు వెల్లడించారు. ‘నాసా ఇన్సైట్ మిషన్’ డాటా విశ్లేషణలో ఈ విషయాలు వెలుగుచూశాయి.
ప్రపంచంలోనే తొలి లేజర్ యాంజియోప్లాస్టీ
రాయ్‌పూర్, జూలై 5: కిడ్నీ, గుండె నాళాల్లో అడ్డంకులను లేజర్ యాంజియోప్లాస్టీతో ఏకకాలంలో తొలగించి ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ దవాఖాన వైద్యులు రికార్డు సృష్టించారు. ప్రపంచంలో ఈ తరహా చికిత్స ఇదే మొదటిదని వెల్లడించారు. 66 ఏండ్ల రోగి గుండె ధమని 90 శాతం పూడుకుపోయిందని, ఎడమ మూత్రపిండంలోని నాళం 100 శాతం మూసుకుపోయిందని డాక్టర్ స్మిత్ శ్రీవాస్తవ తెలిపారు. లేజర్ సాయంతో నాళాల్లో బెలూన్ను చొప్పించి శస్త్రచికిత్స పూర్తిచేశామన్నారు. రోగి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు.