న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: 850 మంది సభ్యులతో కూడిన లోక్‌సభను ప్రతిపాదిస్తున్నందున ప్రభుత్వం పెరిగే వ్యయంతోపాటు దేశ రాజధానిలో ప్రతిపాదిత కొత్త ఎంపీలకు వసతి కొరతను కూడా ఎదుర్కోనున్నది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి కూడా స్థల సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. సాధారణ అంచనాల ప్రకారం సభ సమావేశంలో ఉన్న ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంపై చేసే ఖర్చుకు అదనంగా ప్రభుత్వం ఒక్కో సభ్యుడిపైన దాదాపు రూ.1 లక్ష ఖర్చు చేస్తుంది. ఇందులో జీతాలు, ప్రయాణ భత్యాలు, వైద్య సౌకర్యాలపై ప్రభుత్వం చేసే ఖర్చు చేర్చలేదు. లూటియన్స్ జోన్లో ఇండ్ల కొరత ఉన్నందున పెరిగిన సంఖ్యలతో కేటాయింపుల విషయంలోనే తాము అడ్డంకిని ఎదుర్కొంటామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రతి సభ్యునికి రోజుకు సమారు రూ.1 లక్ష, అంటే మొత్తం రూ. 8 కోట్లు ఖర్చు చేస్తుంది.
మరో అంచనా ప్రకారం పార్లమెంట్ సమావేశాల సమయంలో నిమిషానికి రూ. 2.5 లక్షలు అంటే మొత్తం రోజుకు రూ. 8-9 కోట్లు ఖర్చు చేస్తుంది. సభ్యుల సంఖ్య 850కి పెరిగితే రోజువారీ ఖర్చు రూ. 3 కోట్లు అదనంగా పెరుగుతుంది. అయితే ఇది పార్లమెంట్ ప్రాంగణాన్ని నడపడానికి అయ్యే నిర్వహణ ఖర్చు మాత్రమే. పార్లమెంట్ సభ్యుల జీతంతోపాటు అనేక ఇతర సౌకర్యాలకు అర్హులు. ఒక ఎంపీ ప్రస్తుత జీతం నెలకు రూ. 1 లక్ష. ఐదేండ్ల పదవీ కాలంలో ప్రతి సంవత్సరానికి రూ. 2,000తోపాటు అదనంగా రూ. 25,000 పింఛను ఉంటుంది. సభ్యులకు వసతి, తాత్కాలిక వసతి, ఉచిత రైల్వే టికెట్లు, ఉచిత ఫోన్ కనెక్షన్, ఉచిత విద్యుత్తు, ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఉచిత నీరు వంటి సౌకర్యాలు లభిస్తాయి. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు ఒక్క ఎంపీకి ఏడాదికి రూ. 4.29 కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుత ఎంపీల సంఖ్యకు అదనంగా 272 మంది కొత్త ఎంపీలను చేర్చడం వల్ల కేవలం పార్లమెంట్‌లోనే ఏటా అదనంగా రూ. 1,171 కోట్లు ఖర్చవుతుంది. రాష్ట్ర అసెంబ్లీల విస్తరణ, 4,000 మంది కొత్త సభ్యుల చేరికతో మరో రూ. 5,000-8,000 కోట్ల అదనపు ఖర్చు ఉండే అవకాశం ఉంది.
సభ్యులకు వసతి సమకూర్చడం పెద్ద సమస్యగా మారవచ్చు. లుటియన్స్ జోన్లో సుమారు 850 బంగళాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇండ్లను రాయబార కార్యాలయాలకు, ప్రజా స్మారక చిహ్నాలకు కేటాయించారు. మిగిలిన వాటిని వివిధ పూల్స్‌లో ప్రభుత్వానికి కేటాయించారు. 2015 వరకు లోక్‌సభ సభ్యుల పూల్‌లో 517 బంగళాలు ఉండేవి. బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో 8-9 సముదాయాల నిర్మాణం తర్వాత మరో 349 ఫ్లాట్లు దీనికి జత అయ్యాయి. కాగా, కొత్త భవనంలోని లోక్‌సభలో తగినంత సీటింగ్ ఉంది. ఒక్కో సభలో 880-890 సీట్లతో సీటింగ్ ఉంది. అయితే 1,100 మంది ఎంపీలు కూర్చునేంత సీటింగ్ లేదు. దశాబ్దం క్రితం 1927లో నిర్మించిన సంవిధాన్ సదన్‌లో ఉమ్మడి సమావేశం కోసం 800 ఎంపీలకు సరిపడ సీటింగ్ ఉందని, కొత భవనంలో ఆ సౌకర్యం లేదని ఒక అధికారి చెప్పారు.