న్యూఢిల్లీ : రెండు వేర్వేరు రాష్ర్టాలలోని ఓటర్లకు ఒకే రకమైన ఓటరు కార్డు నంబర్లను ఇచ్చినట్టు వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో దీనిపై ఎన్నికల కమిషన్ ఆదివారం స్పందిచింది. డూప్లికేట్ నంబర్లను నకిలీ ఓటర్లుగా భావించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొందరు ఓటర్ల ఎలెక్టర్ ఫొటో ఐడెంటిటీ కార్డు(ఎపిక్) నంబర్లు ఒకేరకంగా ఉండవచ్చని, కాని భౌగోళిక వివరాలు, నియోజకవర్గం, పోలింగ్ బూత్ వంటి ఇతర వివరాలు వేరేగా ఉంటాయని తెలిపింది. అన్ని రాష్ర్టాల ఓటర్ల జాబితాను ఈరోనెట్ ప్లాట్‌ఫామ్‌కు మార్చడానికి ముందు వికేంద్రీకృత, మాన్యువల్ మెకానిజాన్నే పాటించడం జరిగిందని, ఈ కారణంగా వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని కొందరు ఓటర్లకు ఒకేరకమైన ఎపిక్ నంబర్లు లేదా సిరీస్ కేటాయించామని తెలిపింది. దీని ఫలితంగా కొన్ని రాష్ర్టాల ప్రధాన ఎన్నికల అధికారులు అదే ఎపిక్ నంబర్లను ఉపయోగించడంతో డూప్లికేట్ ఎపిక్ నంబర్లు వచ్చి ఉండవచ్చని ఈసీ పేర్కొంది. ఏదేమైనా డూప్లికేట్ ఎపిక్ నంబర్లపై అపోహలను తొలగించేందుకు రిజిస్టర్డ్ ఓటర్లకు విశిష్ట ఎపిక్ నంబర్లను కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు ఈసీ తెలిపింది.
ఈసీ వివరణపై టీఎంసీ స్పందిస్తూ ఈసీని బీజేపీ పోలింగ్ రిగ్గింగ్ విభాగంగా అభివర్ణించింది. భారీ స్థాయిలో ఎన్నికల మోసానికి ఈసీ అవకాశం కల్పిస్తున్నట్టు ఆరోపించింది. వివిధ రాష్ర్టాలలో డూప్లికేట్ ఓటరు ఫొటో గుర్తింపు కార్డులను అందచేసి బీజేపీ ఎన్నికల్లో రిగ్గింగుకు పాల్పడిందని మండిపడింది. ఈ వ్యూహాన్ని మహారాష్ట్ర, ఢిల్లీలో విజయవంతంగా అమలు చేసిన బీజేపీ బెంగాల్లో ప్రయత్నించి భంగపాటుకు గురైందని పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఎలా చెరబట్టిందో ఇప్పుడు ఈసీ ఒప్పుకోవడంతో మమతా బెనర్జీ చెప్పింది అక్షరసత్యంగా రుజువైందని టీఎంసీ తెలిపింది.