Sparrows : పట్టణీకరణ (Urbanization) పెరిగినా కొద్ది పిచ్చుకలు (Sparrows) కనుమరుగవుతూ వచ్చాయని, ఇప్పుడు నగరాల్లో ఎక్కడా పిచ్చుకలు కనిపించడం లేదని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మన్ కీ బాత్ (Mann Ki Baat) 116వ ఎపిసోడ్లో ప్రధాని ప్రసంగించారు. పిచ్చుకలు జీవవైవిద్య నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయని, కాబట్టి పిచ్చుకల జనాభాను తిరిగి పెంచాల్సిన అవసరం చాలా ఉన్నదని ప్రధాని చెప్పారు.
ఈ తరం పిల్లల్లో చాలా మందికి పిచ్చుకలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదని, కేవలం ఫొటోల్లో, వీడియోల్లో వాటిని చూపించాల్సి వస్తోందని ప్రధాని మోదీ అన్నారు. అలాంటి పిల్లలు పిచ్చుకలను ప్రత్యక్షంగా చూసే రోజు మళ్లీ రావాలని ఆకాంక్ష వెలిబుచ్చారు. కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తే అది అసాధ్యమేమీ కాదని అన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు రాజధాని చెన్నైలోని కుడుగల్ ట్రస్ట్ పిచ్చుకల జనాభా పెంపు కోసం చేస్తున్న కృషి గురించి ప్రధాని తెలియజేశారు.
కుడుగల్ ట్రస్ట్ వారు పిచ్చుకల జనాభా పెంచే ప్రయత్నంలో స్కూల్ పిల్లలను భాగస్వాములను చేస్తున్నారని ప్రధాని చెప్పారు. రోజువారి జీవితంలో పిచ్చుకల ప్రాముఖ్యాన్ని గురించి వారు స్కూల్ పిల్లలకు వివరిస్తున్నారు. పిల్లలు పిచ్చుక గూళ్లను నిర్మించేలా కుడుగల్ ట్రస్ట్ సిబ్బంది శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. చిన్నచిన్న చెక్క గూళ్లను ఎలా నిర్మించాలో చూసిస్తున్నారని చెప్పారు. పిచ్చుకలకు ఆవాసాలతోపాటు ఆహారాన్ని కూడా అందుబాటులో ఉంచేలా తర్ఫీదు నిస్తున్నారని ప్రధాని తెలిపారు.