న్యూఢిల్లీ, జూన్ 18: ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు ఇంతకు ముందులా ఆసక్తి చూపటం లేదు. స్టడీ, వర్క్ వీసా జారీల్లో కెనడా చేసిన మార్పులు, పెరిగిన ఆర్థిక భారం, వీసా జారీ ప్రక్రియ కఠినతరం చేయటం, భారత్-కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతినటం.. ఇవన్నీ ప్రభావం చూపాయి. స్టడీ పర్మిట్లను ఆ దేశం 35 శాతం తగ్గించటం ఈ ఏడాది ఆరంభంలో భారతీయ విద్యార్థుల్ని తీవ్రంగా నిరాశపర్చింది.
గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య స్టడీ పర్మిట్ల జారీ 86 శాతం వరకు తగ్గింది. అంతేగాక ఇప్పటికే ఆ దేశానికి చేరుకున్న మన విద్యార్థులు అక్కడ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తున్నది. నూతన ఇమ్మిగ్రేషన్ పాలసీలో కెనడా చేసిన మార్పులు, తమ తల్లిదండ్రులపై మరింత ఆర్థికభారం మోపుతుందని భారతీయ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత కష్టపడి ఇక్కడకు రావాల్సిన అససరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.
పంజాబ్, హర్యానా నుంచే అత్యధికం
కెనడాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో 41 శాతం భారత్ నుంచి వచ్చినవారే ఉన్నారు. ఆ దేశ ఆర్థిక వృద్ధిలో అంతర్జాతీయ విద్యార్థులది కీలక పాత్ర. ప్రతిఏటా పంజాబ్, హర్యానా నుంచి అత్యధికమంది విద్యార్థులు కెనడాకు వెళ్తుంటారు. ఒక్క పంజాబ్ రాష్ట్రం కెనడా చదువుల కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని ఒక అంచనా! అయితే, అంతర్జాతీయ విద్యార్థుల రాకతో కెనడా జాబ్ మార్కెట్లో పోటీ పెరిగింది.
ఇండ్ల ధరలు, వాటి కిరాయిలు భారీగా పెరిగాయి. ఖలిస్థాన్ వేర్పాటువాదం భారత్తో సంబంధాల్ని దెబ్బతీసింది. కెనడా తన స్టడీ, వర్క్ వీసా విధానాల మార్పునకు ఇవి దారితీశాయని నిపుణులు చెబుతున్నారు. వారానికి గరిష్టంగా 24 గంటలు మాత్రమే క్యాంపస్ బయట పనిచేసుకునేలా ట్రూడో సర్కారు నిబంధనల్ని మార్చింది.
భారత విద్యార్థుల నిరసనలు
కొత్త వలస విధానంలో కెనడా చేసిన మార్పులపై ఆ దేశంలో ఉంటున్న భారతీయ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ‘ప్రిన్స్ ఎడ్వార్డ్ ఐలాండ్’ (పీఈఐ)లోని విద్యార్థులు ‘బిగ్ బ్లాకౌట్’కు పిలుపునిచ్చారు. తమను బలవంతంగా దేశం నుంచి వెళ్లగొట్టేందుకు కొత్త వలస విధానంలో మార్పులు చేసినట్టు వారు ఆరోపిస్తున్నారు. విద్య, పని అనుభవం ఉన్న కార్మికులకు ‘పీఎన్పీ’ (ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్) కింద వీసాలు జారీచేస్తారు. ఇది పీఈఐలో జూన్ 20న అధికారులు నిర్వహిస్తున్నారు. గురువారం నామినేషన్ల డ్రా చేపట్టనున్నారు. దీనికంటే ఒక రోజు ముందు పీఈఐలో విద్యార్థులు నిరసనకు పిలుపునివ్వటం గమనార్హం.