బెంగళూరు, జనవరి 8 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తదుపరి చైర్మన్‌గా డాక్టర్ వీ నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీకాలం ముగియనుండటంతో జనవరి 14న నారాయణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. నారాయణన్ సారథ్యంలో చంద్రయాన్-4, గగన్‌యాన్, శుక్రయాన్, మంగళ్యాన్-2, పునర్వినియోగ వాహకనౌక తయారీ వంటి కీలక ప్రాజెక్టులను ఇస్రో చేపట్టనుంది. 1984లో శాస్త్రవేత్తగా ఇస్రోలో చేరిన నారాయణన్ నాలుగు దశాబ్దాలుగా అనేక కీలక ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యారు. ఆయన నాయకత్వంలో పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ సహా అనేక ఇస్రో ప్రయోగాలకు ఎల్పీఎస్సీ 183 లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్‌లు, కంట్రోల్ పవర్ ప్లాంట్లను అందించింది. చంద్రయాన్-2, చంద్రయాన్-3, ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగాల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. జీఎస్ఎల్వీ ఎంకే III వాహక నౌకకు సంబంధించిన సీ25 క్రయోజెనిక్ ప్రాజెక్టుకు ఆయన ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేశారు.