Dowry murder : గ్రేటర్ నోయిడా (Greater Noida) వరకట్న హత్య (Dowry murder) కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నోయిడా పోలీసులు ఇప్పటికే నిందితుడు విపిన్ భాటి (Vipin Bhati) ని, అతడి తల్లిని అరెస్ట్ చేశారు. విపిన్ భాటిని ఆదివారం ఉదయం అరెస్ట్ చేయగా, అతడి తల్లిని సాయంత్రం అరెస్ట్ చేశారు. ముందుగా అరెస్టయిన విపిన్ భాటిని కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ (Judicial remand) విధించింది.
హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు ఆదివారం మధ్యాహ్నం మృతురాలు భర్త విపిన్ భాటి తారసపడ్డాడు. అతడిని పట్టుకునేందుకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడి కాళ్లపై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. పోలీసుల కాల్పుల్లో విపిన్ భాటి ఎడమ కాలుకు బుల్లెట్ గాయమైంది.
భాటి అరెస్ట్ తర్వాత అతడి తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అరెస్టుపై మృతురాలు నిక్కీ తండ్రి భికారీ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. తన బిడ్డకు, ఆమె భర్తకు మధ్య గొడవను పెంచింది ఆమేనని, ఆమె అరెస్ట్ తనకు సంతోషాన్నిచ్చిందని అన్నారు. నిందితులను ఉరికంబం ఎక్కించాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రేటర్ నోయిడాలో నిక్కీ అనే 30 ఏళ్ల మహిళను అత్తింటి వాళ్లు కిరోసిన్ పోసి తగులబెట్టారు. నిక్కీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.