Dowry murder : గ్రేటర్ నోయిడా (Greater Noida) వరకట్న హత్య (Dowry murder) కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగరిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ (Judicial remand) విధించింది. దాంతో పోలీసులు వారిని గౌతమ్‌బుద్ధ నగర్ (Gautham Budh Nagar) లోని జిల్లా జైలుకు తరలించారు.
మృతురాలి నిక్కీ భర్త విపిన్‌ను పోలీసులు ఆదివారమే అరెస్ట్ చేశారు. అయితే అతడు పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. ఈ కాల్పుల్లో అతడి ఎడమ కాలులోకి బుల్లెట్ దిగింది. ఆస్పత్రిలో చికిత్స చేయించిన అనంతరం ఆదివారం సాయంత్రం అతడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
ఆదివారం రాత్రి మృతురాలి అత్త దయా భాటీ పోలీసులకు చిక్కింది. సోమవారం ఉదయం మృతురాలి బావ రోహిత్ భాటీ, మామ సత్యవీర్ భాటీ కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ముగ్గురిని సోమవారం సాయంత్రం పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దాంతో కోర్టు నిందితులు ముగ్గురికి కూడా రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు వారిని గౌతమ్‌బుద్ధనగర్ జిల్లా జైలుకు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన భికారీ సింగ్ తన ఇద్దరు కుమార్తెలు కాంచన్, నిక్కీలను 2016లో అదే నగరానికి చెందిన సత్యవీర్ భాటీ, దయా భాటీ దంపతుల కుమారులైన రోహిత్ భాటీ, విపిన్ భాటీలకు ఇచ్చి వివాహం జరిపించారు. అప్పటి నుంచి ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరినీ అత్తింటివాళ్లు వేధింపులకు గురిచేస్తూ వచ్చారు.
విపిన్ భాటీ తనకు కారు కావాలని నిక్కీని వేధించడంతో ఆమె తండ్రి స్కార్పియో కారు ఇప్పించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే బుల్లెట్ బైక్ కావాలని హింసించడంతో బుల్లెట్ బైక్ కూడా కొనిచ్చాడు. ఈ క్రమంలో నిక్కీ తండ్రి కొన్ని రోజుల క్రితం మెర్సిడెస్ కారు కొన్నాడు. దాంతో ఆ మెర్సిడెస్ కారు తనకే కావాలని నిక్కీని వేధించాడు. దాంతో ఆమె తన తండ్రిని అడిగేందుకు నిరాకరించింది.
దాంతో వేధింపులను మరింత తీవ్రం చేశాడు. ఆ వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో విపిన్ తన తల్లిదండ్రులను వెంట తీసుకెళ్లి నిక్కీని కాపురానికి రమ్మన్నాడు. ఇకపై వేధించకుండా బాగా చూసుకుంటానని నిక్కీకి, ఆమె తండ్రి భికారి సింగ్‌కు మాటిచ్చాడు. దాంతో భికారి సింగ్ నచ్చజెప్పి బిడ్డను కాపురానికి పంపాడు. కానీ విపిన్ వేధింపులు ఆపలేదు.
ఈ క్రమంలో ఈ నెల 21 సాయంత్రం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. నిక్కీని విపిన్ తీవ్రంగా కొట్టాడు. జుట్టుపట్టుకుని ఇంట్లోంచి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాడు. నిక్కీ అత్త దయా భాటీ కొడుకుని వారించాల్సింది పోయి ఆమె కూడా కోడలిపై దాడికి పాల్పడింది. తన చెల్లెలిపై దాడిని అడ్డుకునేందుకు కాంచన్ ప్రయత్నించగా ఆమెను పక్కకు తోసేశారు. రోడ్డుపైనే నిక్కీని దారుణంగా కొట్టారు.
అంతటితో ఆగకుండా విపిన్ నిక్కీని ఇంట్లోకి లాక్కెళ్లి ఆమెపై కాలే స్వభావం ఉన్న ఏదో ద్రవం చల్లి నిప్పంటించాడు. దాంతో నిక్కీ మంటల్లో కాలిపోతూ కేకలు వేస్తూ కిందకు పరుగులు తీసింది. అక్క కాంచన్ నీళ్లు చల్లి మంటలను ఆర్పేసింది. నిక్కీ ఆరేళ్ల కుమారుడి కళ్లముందే ఇదంతా జరిగింది. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న నిక్కీని ఆమె సోదరి కాంచన్ అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించింది.
డెబ్బై శాతం కాలిన గాయాలైన నిక్కీ సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదేరోజు ప్రాణాలు కోల్పోయింది. చెల్లెలిపై అత్తింటివారి దాడి దృశ్యాలను, చెల్లెలు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలను కాంచన్ రహస్యంగా తన ఫోన్లో రికార్డు చేసింది. ఆ సాక్ష్యాల ఆధారంగా తన అత్తింటి వారిపై కేసు పెట్టింది. పెళ్లయిన నాటి నుంచి మా ఇద్దరిని అత్తింటి వాళ్లు నిత్యం వేధిస్తున్నారని, నా కళ్ల ముందే నా చెల్లెలి ప్రాణాలు తీశారని ఫిర్యాదులో పేర్కొంది.