Karur Stampede : కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటన తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు నటుడు విజయ్ (Actor Vijay) రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. దీనిపై ఓ మృతురాలి సోదరి తీవ్రంగా స్పందించారు.
‘మీరు పరిహారంగా ఇచ్చే నగదుతో మా అక్క ప్రాణాలు తిరిగొస్తాయా..?’ అని ఆమె ప్రశ్నించారు. ‘మీ డబ్బులు మాకొద్దు.. పోయిన మా అక్క ప్రాణాలు కావాలి’ అని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బృంద అనే మహిళ నటుడు విజయ్‌కి పెద్ద అభిమాని. శనివారం విజయ్ కరూర్‌లో ప్రచారానికి వస్తున్నాడని తెలిసి బృంద ఆయనను చూసేందుకు తహతహలాడింది. పసివాడైన తన కుమారుడిని చెల్లెలి దగ్గర వదిలి వెళ్లింది.
కానీ అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కరూర్ ర్యాలీలో తొక్కిసలాట గురించి తెలుసుకున్న బృంద కుటుంబసభ్యులు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందన లేదు. రాత్రి 10 గంటల తర్వాత ఆమె ఫోన్ స్విచాఫ్ అయ్యింది. ఆదివారం ఉదయం ర్యాలీ నిర్వాహకులకు బృంద భర్త ఆమె ఫొటోను పంపించగా ఆమె మరణించినట్లు తెలిపారు. దాంతో ఆ కుటుంబం శోకసంద్రమైంది.
కాగా కరూర్‌లో శనివారం రాత్రి నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల కటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున, తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున, కేంద్రం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.