ఇప్పటివరకు పోలీస్, ఆర్మీ విధుల్లోనే కుక్కలు పనిచేసేవి. కానీ ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్స్ లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నాయి. వాటికి కూడా జీతంతో పాటు పనివేళలు ఉన్నాయి. ఇంతకీ ఈ విచిత్రం ఎక్కడనుకున్నారు మనదేశంలోనే.
గుజరాత్ లో కోవిడ్ కేసుల సంఖ్య రోజుకి వేలల్లో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య వందల్లో ఉంటోంది. దీంతో కోవిడ్ హాస్పిటల్స్ లో ఓ రకమైన భయానక వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి పేషెంట్లు , బంధువులతో పాటు హాస్పిటల్ సిబ్బంది కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఏం చేయాలా అని సూరత్ హాస్పిటల్ వర్గాలు తెగ ఆలోచించాయి. అప్పుడే వాళ్లకు ఈ కుక్క కనిపించింది.
ఎంతోకాలంగా హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న ఈ కుక్కని చేరదీసి దాన్ని సెక్యూరిటీ గార్డ్ గా నియమించారు. ఐడీ కార్డు అన్నీ ఏర్పాటు చేశారు. హాస్పిటల్ గేటు ముందు తిరుగుతూ వచ్చే పోయే రోగులు,బంధువులను తన అమాయకపు చూపులు, చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటోంది.
జీతంగా దీనికి మూడుపూటల భోజనం పెడుతున్నారు హాస్పిటల్ సిబ్బంది. అలాగే ఎలాంటి అనారోగ్యంరాకుండా కూడా చూసుకుంటున్నారు. ఈ కుక్క కూడా పిల్లులు ఇతర జంతువులు లోపలికి పోకుండా చూసుకుంటూ హాస్పిటల్ కి వచ్చే ప్రతీ ఒక్కరిని పలకరిస్తూ వెంట తిరుగుతుండటంతో కాస్తంత రిలాక్స్ అవుతున్నారు.