(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రోగికి నిర్లక్ష్యంగా చికిత్సను అందించిన డాక్టర్ చనిపోయినప్పటికీ, ఆ కేసు ముగిసిపోదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. డాక్టర్ లేనప్పటికీ, సదరు కేసులో ఆ డాక్టర్ వారసులను ప్రతివాదులుగా చేర్చొచ్చని పేర్కొన్నది. అయితే, కేసు రుజువైతే, వారసుల నుంచి కాకుండా.. పొరపాటు చేసిన డాక్టర్ ఆస్తుల నుంచి పరిహారాన్ని వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు దశాబ్దాల కిందటి ఓ కేసులో జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్తో కూడిన అత్యున్నత ధర్మాసనం సోమవారం కీలక తీర్పునిచ్చింది.
తన భార్యకు కుడి కంటిలో సమస్యగా ఉందని 1990లో ఓ వ్యక్తి ప్రైవేట్ వైద్యుడు ఒకరికి చూయించాడు. పరీక్షలు చేసిన సదరు డాక్టర్ ఆమె కంటికి ఆపరేషన్ చేశాడు. అయితే, సమస్య తీరకపోగా, ఆమె కంటి చూపు పోయింది. ఆ తర్వాత ఎడమ కంటి చూపు కూడా మందగించింది. వేరే వైద్యులకు చూయించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. దీంతో వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తన భార్య కంటి చూపు పోయిందంటూ సదరు వ్యక్తి 1997 ఆగస్టులో వినియోగదారుల కమిషన్‌లో కేసు వేశాడు. వైద్య ఖర్చులతో పాటు తన భార్య అనుభవించిన మానసిక వేదనకు గానూ రూ. 4.5 లక్షలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అలా ఈ కేసు క్రమంగా జిల్లా, రాష్ట్ర వినియోగదారుల కమిషన్ నుంచి చివరకు జాతీయ వినియోగదారుల కమిషన్ ముందుకు వచ్చింది. అయితే, చికిత్స అందించిన డాక్టర్ 2009 ఆగస్టులో మరణించాడు. దీంతో చనిపోయిన డాక్టర్ నుంచి పరిహారం ఎలా ఆశించవచ్చు? అనే ప్రశ్న ముందుకొచ్చింది. దీంతో ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే, వ్యక్తి చేసే పొరపాటు వ్యక్తిగతమని, దాన్ని కుటుంబానికి ఆపాదించి ఎలా బాధ్యులను చేస్తారంటూ సెక్షన్ 360ను ఉటంకిస్తూ చనిపోయిన డాక్టర్ భార్య, కుమారుడు వాదించారు. అటువైపున ఫిర్యాదుదారు వాదిస్తూ.. డాక్టర్ చేసిన తప్పుకు తామెందుకు నష్టపోవాలంటూ ప్రశ్నించారు.
ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. తప్పుడు చికిత్సను చేసిన డాక్టర్ చనిపోయినంత మాత్రాన కేసు ముగిసిపోదని తేల్చి చెప్పింది. అలాంటి కేసుల్లో డాక్టర్ వారసులను ప్రతివాదులుగా చేర్చవచ్చని పేర్కొన్నది. అయితే, పరిహారాన్ని మాత్రం వ్యక్తిగతంగా వారసుల నుంచి కాకుండా బాధ్యుడైన డాక్టర్ ఆస్తుల నుంచి వసూలు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఇదే సమయంలో కోర్టు కొన్ని కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ కేసులో డాక్టర్ తప్పు చేశాడా? లేదా? అనేది తాము నిర్ధారించడం లేదని, కేవలం తప్పు చేసిన సందర్భంలో అనుసరించాల్సిన ప్రక్రియను మాత్రమే సూచిస్తున్నట్టు నొక్కి చెప్పింది. కేసులో మెరిట్‌ను సంబంధిత విభాగం పరిశీలించాలని, పరిహారంపై వినియోగదారుల కమిషన్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నది.
సుల్తాన్‌బజార్, మే 5: వైద్యుల నిర్లక్ష్యానికి వారి చట్టపరమైన వారసులను బాధ్యులుగా పేర్కొంటూ సుప్రీం కోర్టు ఇచ్చి న తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ పి కిషన్, కార్యదర్శి డాక్టర్ వి అశోక్, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ టి దయాల్సింగ్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై తక్షణ శాసనపరమైన జోక్యం కోసం డిమాండ్ చేస్తున్నామన్నారు. కుముద్ లాల్ వర్సెస్ సురేశ్ చంద్ర రాయ్ (మరణించిన) చట్టపరమైన ప్రతినిధుల కేసులో సుప్రీం కోర్టు ఈ నెల 4న ఇచ్చిన తీర్పుపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యుడి మరణంతో వినియోగదారుల క్లెయిమ్‌లన్నీ రద్దవుతున్నాయని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ దీర్ఘకాలిక వైఖరిని ఈ తీర్పు తోసిపుచ్చిందని పేర్కొన్నారు.
తమకు ఏ మాత్రం సంబంధం లేని చర్యలకు అమాయక కుటుంబాలు శిక్షకు గురవుతాయని అన్నారు. మరణం అనంతరం చాలా కాలం గడిచాక వైద్యుని వారుసుల ఆస్తిని తిరిగి రాబట్టుకోగల వాణిజ్య బాధ్యతగా పరిగణించడం అనేది వైద్య వృత్తి స్వభావాన్ని ప్రాథమికంగా తప్పుగా అర్థం చేసుకోవడమే అని అన్నారు. జాతీయ భారత వైద్య సంఘం ఈ విషయాన్ని అత్యవసర ప్రాతిపదికన చేపట్టాలని అన్నారు. సుప్రీం కోర్టులో సమీక్షా పిటిషన్, సంబంధిత కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం, రిట్ పిటిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు వినతి పత్రాలు దాఖలు చేసే అవకాశాలను అన్వేషించడానికి ఒక ఉన్నత స్థాయి న్యాయ కార్యదళాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వైద్యుల కుటుంబాలకు రక్షణ లభించే వరకు తాము విశ్రమించమని ఐఎంఏ తెలంగాణ శాఖ స్పష్టం చేసింది.