చెన్నై: ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు వినియోగించే టాయిలెట్లో పెన్ కెమెరా ఉంది. ఒక నర్సు దీనిని గుర్తించింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు చేసి చివరకు ఒక వైద్యుడ్ని అరెస్ట్ చేశారు. (pen camera inside washroom) తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఈ సంఘటన జరిగింది. పొల్లాచిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు వినియోగించే టాయిలెట్లో పెన్ కెమెరా ఉంది. రహస్యంగా అమర్చిన దానిని గురువారం ఒక నర్సు గుర్తించింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ దృష్టికి ఇది వెళ్లింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఆసుపత్రికి చేరుకున్నారు. టాయిలెట్లో రహస్యంగా ఉంచిన పెన్ కెమెరా, అందులోని మెమరీ కార్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిని ఆన్లైన్లో కొనుగోలు చేసి టాయిలెట్లో ఉంచిన 33 ఏళ్ల డాక్టర్ వెంకటేశ్‌ను శనివారం అరెస్ట్ చేశారు.
మరోవైపు నిందితుడు వెంకటేశ్ కోయంబత్తూరు మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. ట్రైనింగ్‌లో భాగంగా పొల్లాచిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఐటీ చట్టం, భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.