న్యూఢిల్లీ: మోసపూరిత రీఫండ్ ఈ-మెయిల్స్, అధికారిక పోర్టల్స్ లాగా భ్రమింపచేసే నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయ పన్ను శాఖ ప్రజలను హెచ్చరించింది. పిన్, పాస్వర్డ్స్, బ్యాంక్ సమాచారం లాంటి వ్యక్తిగత విషయాలను తాము ఎన్నడూ అడగమని స్పష్టం చేసింది. ట్యాక్స్ రీఫండ్ అవుతుందని లేదా ఈ-పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చే ఈ-మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసిన ఒక సూచనను ఆ శాఖ ప్రజలతో పంచుకుంది.
ఇలాంటి స్కామ్‌లు సున్నితమైన ఆర్థిక సమాచారాన్ని తెలుసుకొనేందుకు చేసే విస్త్రృతమైన ఫిషింగ్ ప్రయత్నమని తెలిపింది. మోసపూరిత ఈ-మెయిల్స్‌లోని చిహ్నాలు, భాష సరైనవి లాగానే అనిపిస్తాయని.. కానీ వాటిని క్లిక్ చేస్తే హానికారక వెబ్సైట్లకు తీసుకెళ్లడం లేదా హానికారక అటాచ్మెంట్ల డౌన్లోడ్ ప్రేరేపణ జరగొచ్చని పేర్కొంది. ప్రజలు తమ ఫోన్లు, కంప్యూటర్ల అనధికారిక యాక్సెస్ నిరోధించడానికి యాంటి వైరస్, యాంటిస్పైవేర్, ఫైర్‌వాల్ సాఫ్ట్వేర్ లాంటికి అప్డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.