తిరుప్పత్తూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. విజయ్ నేతృత్వంలోని ఆ పార్టీ 108 సీట్లు సాధించి.. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా అవతరలించింది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. అయితే విజయ్ వేవ్‌లో డీఎంకే నేతలు చెల్లాచెదురయ్యారు. ఆ రాష్ట్ర సహకార శాఖ మాజీ మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ అనూహ్య రీతిలో ఓటమిపాలయ్యారు. ఆయన ఒకే ఒక్క ఓటు తేడాతో ఓటమి చెందారు.
తిరుప్పత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమిళగ వెట్రి కజగం పార్టీ నుంచి సీనివాస సేతుపథి పోటీ చేశారు. అయితే తాజా ఫలితాల్లో టీవీకే నేతకు 83, 375 ఓట్లు పోలయ్యాయి. ఇక రెండవ స్థానంలో పెరియకరుప్పన్‌కు 83,374 ఓట్లు పడ్డాయి. చాలా ఆసక్తికరంగా ఈ రేస్ కొనసాగింది. చివరి రౌండ్ వరకు పోటీ నువ్వానేనా అన్నట్లుగా సాగింది. చివరి రౌండ్ కన్నా ముందు రౌండ్లో 30 ఓట్ల ఆధిక్యంలో డీఎంకే నేత పెరియకరుప్పన్ ఉన్నారు. కానీ అనూహ్యమైన రీతిలో మాజీ మంత్రికి షాక్ తగిలింది. చివరి రౌండ్లో టీవీకే నేత సీనివాస సేతుపథ పుంజుకుని విజయాన్ని నమోదు చేశారు.
పెరియకరుప్పన్ కన్నా ఒక్క ఓటు ఎక్కువ ఆర్జించారు. దీంతో టీవీకే నేత థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేశారు. తిరుప్పత్తూరు స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ నేత కేసీ తిరుమరన్ మూడవ స్థానంలో నిలిచారు. ఆయనకు 29,054 ఓట్లు పోలయ్యాయి.