చెన్నై: హిందువులు నుదుట పెట్టుకునే తిలకం ఆచారంపై మంత్రి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. వేశ్యతో ముడిపెట్టి ఒక జోక్ వేశారు. దీంతో ఆ మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పార్టీ పదవి నుంచి ఆయనను తొలగించారు. తమిళనాడు అటవీ శాఖ మంత్రి, సీనియర్ డీఎంకే నేత కే పొన్ముడి (DMK Minister K Ponmudi) ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడారు. హిందూ మతపరమైన బొట్టును శృంగారంతో ముడిపెట్టారు. ‘మహిళలు, దయచేసి అపార్థం చేసుకోకండి. ఒక వ్యక్తి ఒక వేశ్య వద్దకు వెళ్తాడు. అతడు శైవుడా లేదా వైష్ణవుడా అని ఆమె అడిగింది. అతడికి అర్థం కాకపోవడంతో ఆమె స్పష్టత ఇచ్చింది. అడ్డ బొట్టు (శైవమతానికి సంబంధించినది) లేదా నామం (వైష్ణవానికి సంబంధించిన నిలువు తిలకం) అతడు ధరిస్తాడా అని అడిగింది. ఆ వ్యక్తి శైవుడైతే ‘పడుకునే’ పొజిషన్, వైష్ణవుడు అయితే ‘లేచి నిలబడే’ పొజిషన్ ఉంటుందని ఆమె వివరించింది’ అని జోక్ వేశారు.
కాగా, డీఎంకే మంత్రి పొన్ముడి వివాదస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. డీఎంకే ఎంపీ కనిమొళి కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ‘మంత్రి పొన్ముడి ప్రసంగం ఆమోదయోగ్యం కాదు. ప్రసంగానికి కారణం ఏమైనప్పటికీ, అలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు ఖండించదగినవి’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్, సింగర్ చిన్మయి శ్రీపాద తదితరులు ఘాటుగా విమర్శించారు.
మరోవైపు డీఎంకే కూడా వేగంగా స్పందించింది. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి పొన్ముడిని తొలగించింది. ఆయన స్థానంలో ఎన్ శివను నియమించింది. కాగా, 2011 నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పొన్ముడికి విధించిన శిక్షను సుప్రీం కోర్టు గత ఏడాది నిలిపివేసింది. దీంతో సీఎం స్టాలిన్ ఆయనను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే పొన్ముడి వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ పదవి నుంచి ఆయనను తప్పించినప్పటికీ మంత్రి పదవి నుంచి తొలగించలేదు.