బెంగళూర్ : మంగళూర్ పేలుడు విషయంలో కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కాషాయ పార్టీ తీరును తప్పుపట్టారు. ఆటోలో కుక్కర్ బాంబు పేలుడు ఘటన కలకలం రేపడంతో ఈ వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. పేలుడు ఘటనలో విచారణ చేపట్టకుండానే ఎవరినైనా టెర్రరిస్టని ఎలా చెబుతారని డీకే శివకుమార్ ప్రశ్నించారు. కుక్కర్ బాంబు క్యారీ చేస్తున్న ఆటో ప్రయాణీకుడిని ఎలాంటి దర్యాప్తు నిర్వహించకుండానే ఉగ్రవాది అని ఎలా అంటారని నిలదీశారు.
అసలు ఉగ్రవాదులెవరు…ఈ ఘటనపై చర్యలేం తీసుకున్నారు..దర్యాప్తు లేకుండానే ఎవరినైనా ఉగ్రవాదిగా ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. ముంబై, ఢిల్లీ, పుల్వామాలో జరిగిన తరహాలో అసలు ఇది ఉగ్రవాద చర్యేనా అని డీకే శివకుమార్ ప్రశ్నించారు.
బాంబు పేలుడు ఘటనను భిన్న కోణంలో ప్రజల ముందు చూపుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ ఈ ఘటనను ఓట్లను దండుకునేందుకు ఉపయోగించుకుంటోదని డీకే శివకుమార్ దుయ్యబట్టారు. ఓట్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ఇలా చేస్తోందని, ఓట్లను రాబట్టకునేందుకు కాషాయ పార్టీ బాంబు పేలుడు ఘటనను బూచిగా చూపుతోందని ఆరోపించారు.