DK Shivakumar : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉన్న కూటమిలే విజయం సాధిస్తాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమిలే విజయం సాధిస్తాయంటూ ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు తప్పవుతాయని డీకే చెప్పారు.
ఉత్తర కన్నడ జిల్లాలోని మురుడేశ్వర దేవాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన శివకుమార్.. ‘తప్పకుండా మేమే గెలుస్తాం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతాయి’ అని అన్నారు. తాను మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించానని, అక్కడి జనాధరణను చూస్తే తప్పకుండా గెలుస్తామనే నమ్మకం కలిగిందని డీకే చెప్పారు.
ఇదిలావుంటే మహారాష్ట్రలో స్వల్ప తేడాతో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమే విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తాను మహారాష్ట్రకు వెళ్లానని, పలువురు నేతలతో మాట్లాడానని, పరిస్థితి ప్రతిపక్ష కూటమికే అనుకూలంగా ఉందని చెప్పారు.