న్యూఢిల్లీ: కోల్కతాలో ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) తొలిసారి స్పందించారు. ఆ ఘటన నిరాశను, భయాన్ని కలిగించినట్లు ఆమె చెప్పారు. ఇక జరిగింది చాలు అని ఆమె అన్నారు. పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ద్రౌపది ముర్ము ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు విద్యార్థులు, డాక్టర్లు, పౌరులు.. కోల్కతా ఘటన పట్ల నిరసన చేపడుతుంటే, మరో వైపు నేరస్థుల మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు ఆమె ఆరోపించారు.
అకృత్యాలకు ఏ నాగరిక సమాజం కూడా తమ కూతుళ్లు, సోదరీమణులను బలి ఇవ్వదని ఆమె పేర్కొన్నారు. సమాజం తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాలని, కొన్ని కఠినమైన ప్రశ్నలు వేసుకోవాలన్నారు. నిర్భయ ఘటన జరిగిన 12 ఏళ్ల కాలంలో.. సమాజం ఎన్నో అత్యాచార ఘటనలను మరిచిపోయిందని, ఇటువంటి సామూహిక మతిమరుపు అసహ్యకరమైదన్నారు. గత తప్పులను ఎదుర్కొనేందుకు సమాజం భయపడుతోందని, కానీ ఇప్పుడు చరిత్రను సమూలంగా మార్చేందుకు సమయం ఆసన్నమైందన్నారు. సమగ్రమైన రీతిలో ఈ సమస్యను నిర్మూలించేందుకు ప్రయత్నిద్దామని ఆమె పేర్కొన్నారు.