డీపీడీపీ చట్టంతో వార్తా సంస్థలు మూతే!
డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) యాక్ట్ నిబంధనల ప్రకారం వార్తలు ప్రచురించే ముందు సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాల్సి వస్తే వార్తాసంస్థలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్(డీఎన్‌పీఏ) సుప్రీంకోర్టుకు తెలిపింది.
- వార్త ప్రచురణకు ముందు సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాలంటే ఎలా?
- దీనితో పరిశోధనాత్మక జర్నలిజానికి ముప్పు
- చట్టం నుంచి జర్నలిజానికి మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టులో డీఎన్‌పీఏ వాదన
న్యూఢిల్లీ : డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) యాక్ట్ నిబంధనల ప్రకారం వార్తలు ప్రచురించే ముందు సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాల్సి వస్తే వార్తాసంస్థలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్(డీఎన్‌పీఏ) సుప్రీంకోర్టుకు తెలిపింది. జర్నలిస్టుల వార్తా సేకరణ, పరిశోధనాత్మక కథనాల ప్రచురణకు ఈ చట్టంలో మినహాయింపులు లేకపోవడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం మంగళవారం డీఎన్‌పీఏ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర న్యాయ శాఖతోపాటు ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక శాఖలకు నోటీసులు జారీచేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన వినకుండా చట్టంపై మధ్యంతర స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది.
వార్త ప్రచురణకు అనుమతి తీసుకోవాలా?
డీఎన్‌పీఏ తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపిస్తూ.. జర్నలిజానికి ప్రత్యేక మినహాయింపు లేకపోవడం వల్ల వార్తలను ప్రచురించే విధానమే మారిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించే ముందు వారి అనుమతి తీసుకోవాలని జర్నలిస్టులను ఆదేశిస్తే వార్తాసంస్థలు స్వేచ్ఛగా పనిచేయలేవని ఆమె పేర్కొన్నారు. ‘మేము ప్రచురించే వార్తల కోసం సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాల్సి వస్తే న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి. ఇది పూర్తిగా ముందస్తు సెన్సార్షిప్ విధానం. మీ గురించి వార్త రాయాలంటే మీ అనుమతి తీసుకోవాలా? అలా అయితే వార్తలకు అర్థం ఏముంటుంది?’ అని ఆమె ప్రశ్నించారు. తప్పుడు, అసత్య లేదా నిరాధార వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని, అయితే వార్త ప్రచురణకు ముందే అనుమతి తీసుకోవాలనే నిబంధన సరికాదని వాదించారు. గతంలో రూపొందించిన డాటా రక్షణ చట్ట ముసాయిదాల్లో జర్నలిజానికి మినహాయింపు ఉండేదని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత చట్టంలో ఆ మినహాయింపును ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదన్నారు.
పరిశోధనాత్మక జర్నలిజానికి ముప్పు
అవినీతి, అధికార దుర్వినియోగం, ప్రజా వ్యవహారాల్లో అక్రమాలపై వార్తలు రాసే సమయంలో సంబంధిత వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుందని డీఎన్‌పీఏ తన పిటిషన్లో పేర్కొన్నది. అలాంటి సందర్భాల్లో సమాచారం సేకరించడానికి, వినియోగించడానికి సంబంధిత వ్యక్తుల సమ్మతి తీసుకోవడం తప్పనిసరి అయితే పరిశోధనాత్మక జర్నలిజం తీవ్రంగా దెబ్బతింటుందని తెలిపింది. అంతేగాకుండా, వార్త సోర్సెస్ గోప్యతను కాపాడటం కూడా కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. నోటీసులు ఇవ్వడం, సమ్మతి పొందడం, సమ్మతిని ఉపసంహరించుకోవడం, వ్యక్తిగత సమాచారాన్ని తొలగించడం వంటి నిబంధనలు వార్తాసంస్థల సాధారణ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవచ్చని పిటిషన్లో వివరించింది. ఈ చట్టంలోని పలు నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని డీఎన్‌పీఏ సుప్రీంకోర్టును కోరింది.
సమాచార హక్కు చట్ట సవరణపైనా అభ్యంతరం
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)(జే)కి చేసిన సవరణను కూడా డీఎన్‌పీఏ సవాల్ చేసింది. డీపీడీపీ చట్టంలోని సెక్షన్ 44(3) ద్వారా ఈ మార్పు తీసుకొచ్చారు. ప్రభుత్వ అధికారుల వద్ద ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడానికి సంబంధించిన ఈ సవరణ వల్ల ప్రజాప్రయోజనాల కోసం సమాచారాన్ని పొందే అవకాశాలు తగ్గుతాయని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై వార్తలు రాయడానికి, ప్రభుత్వ పనితీరును పరిశీలించడానికి, అధికారుల జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి సమాచార హక్కు కీలకమని వార్త సంస్థలు వాదించాయి.
రాజ్యాంగ హక్కులకు విరుద్ధం
డీపీడీపీ చట్టంలోని నిబంధనలు రాజ్యాంగంకల్పించిన హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని డీఎన్‌పీఏ పేర్కొన్నది. ఈ అధికరణలు సమానత్వ హక్కు, వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ, వృత్తిని నిర్వహించుకునే హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తాయి. వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించిన జస్టిస్ కేఎన్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పిటిషనర్లు ప్రస్తావించారు. డాటా రక్షణ చట్టం వ్యక్తిగత గోప్యతను కాపాడటంతోపాటు భావ ప్రకటనాస్వేచ్ఛను, ప్రజల సమాచారహక్కును కూడా గౌరవించాలని పేర్కొన్నారు. అంబానీ, అదానీ గ్రూపులకు చెందిన సంస్థలతోపాటు దేశంలోని పలు ప్రముఖ డిజిటల్ వార్తా సంస్థలకు డీఎన్‌పీఏ ప్రాతినిధ్యం వహిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

