న్యూఢిల్లీ: అభ్యర్థులు సొంత నిర్ణయంతో నామినేషన్లు ఉపసంహరించుకుంటే తామేం చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) ప్రశ్నించారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని అభ్యర్థిని ఒత్తిడి చేస్తేనే ఈసీ జోక్యం చేసుకుంటుందని తెలిపారు. గుజరాత్‌లోని సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారు. మిగతా అభ్యర్థులంతా తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో సూరత్‌లో ఎన్నికలు లేకుండానే బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది.
కాగా, గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీ తన ప్రభావాన్ని వినియోగించిందని, నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని సూరత్‌లో పోటీ చేసే అభ్యర్థులందరిపై ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే నోటాను ఎంచుకునే హక్కు ఓటర్లకు ఉన్నప్పటికీ ఈసీ అక్కడ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని కొందరు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ‘నోటా’కు ఓటు వేసే అవకాశం ఓటర్లకు కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఈసీ ఉల్లంఘించిందా? అని మీడియా ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లకు ‘నోటా’ హక్కు కల్పించేందుకు వీలుగా ఎన్నికల నిబంధనలను ఏమైనా మార్పు చేస్తారా? అని అడిగింది.
మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ దీనికి సమాధానమిచ్చారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని అభ్యర్థిపై ఒత్తిడి చేస్తేనే ఈసీ జోక్యం చేసుకుంటుందని తెలిపారు. అయితే అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంటే మేమేం చేయగలం? అని ప్రశ్నించారు. ‘ఒత్తిడికి లోనైతే, వారిని లాక్కెళ్లినా లేదా బలవంతం చేసినా, అక్కడ మా పాత్ర ఉంటుంది. కానీ వారు వారి స్వంత ఇష్టానుసారం చేస్తే, ఏం చేస్తాం’ అని అన్నారు. ఒక్క అభ్యర్థి మాత్రమే ఉన్న చోట ఎన్నికలు జరుగాలన్న చట్టాన్ని కోరుకోవడం సరైనదిగా తాను అనుకోవడం లేదన్నారు. అయితే అభ్యర్థి ఎవరినీ బలవంతంగా తొలగించకుండా చూసుకోవడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు.