సూరత్: ఆయన ఓ వజ్రాల వ్యాపారి. పేరు సావజీ ఢోలకియా. సూరత్‌లో మానవ సేవా కార్యకలాపాలకు పేరొందిన వ్యక్తి. ప్రభుత్వం అందుకు గుర్తింపుగా ఇటీవల పద్మశ్రీతో సత్కరించింది. ఆ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు 50 కోట్ల విలువ చేసే ఓ హెలికాప్టర్‌ను కానుకగా ఇచ్చారు. సేవాభావంలో అంచులు చూసిన సావజీకి తానొక్కడే హెలికాప్టర్లో చక్కర్లు కొట్టడం నచ్చలేదు. అందుకే ఓ దవాఖానకు దానిని విరాళంగా ఇచ్చేశారు. ‘ఎప్పటి నుంచో దవాఖానకు ఓ హెలికాప్టర్ కొనివ్వాలనుకున్నా. కుదరలేదు. ఇప్పుడు చెప్పాపెట్టకుండా కుటుంబ సభ్యులు హెలికాప్టర్ కొనిచ్చారు. వెంటనే దానిని రోగుల సేవకు విరాళంగా ఇచ్చేశాను’ అని చెప్పారు 59 సంవత్సరాల సావజీ. స్వస్థలమైన సౌరాష్ట్రలోని అమ్రేలీ జిల్లా లాఠీ తాలూకాలో ఆయన ఇప్పటివరకు 75 చెరువులను తవ్వించారు. గతంలో ఆయన తన డైమండ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు 500 కార్లు, 471 నగల సెట్లు, 280 డబుల్ బెడ్రూం ఇండ్లను కానుకగా ఇచ్చి వార్తలకెక్కారు. బడి చదువు మానేసిన ఢోలకియా జేబులో పన్నెండున్నర రూపాయలతో 1977లో తన ఊరి నుంచి సూరత్‌కు వచ్చారు.