పాట్నా: బీహార్‌లో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. ఆ రాష్ట్ర హోం, అగ్నిమాపక శాఖ ఐజీగా ఉన్న వికాస్ వైభవ్.. ఆ శాఖ డీజీ శోభా ఓట్కర్పై ఆరోపణలు చేశారు. డీజీ మేడం తనను రోజూ తిడుతున్నట్లు ఐజీ వికాస్ రెండు రోజుల క్రితం తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. దీంతో ఐపీఎస్‌ల మధ్య ఉన్న వివాదం బయటకు వచ్చింది. వాస్తవానికి ఆ ట్వీట్‌ను ఐజీ వికాస్ కొన్ని గంటల్లోనే డిలీట్ చేసినా.. సోషల్ మీడియాలో ఆ ట్వీట్‌కు చెందిన స్క్రీన్షాట్లు వైరల్ అవుతున్నాయి.
హోంగార్డు, ఫైర్ సర్వీస్ శాఖకు గత ఏడాది అక్టోబర్‌లో వచ్చానని, సక్రమంగా విధుల్ని నిర్వర్తిస్తున్నానని, అయినా కానీ డీజీ మేడం అనవసరంగా తనను తిడుతున్నట్లు ఐజీ వికాశ్ తన ట్వీట్లో ఆరోపించారు. 2003 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ వికాశ్ గతంలో ఎన్ఐఏలో కూడా చేశారు. అయితే తమ మధ్య ఉన్న వివాదాన్ని బహిర్గతం చేయడంతో.. డీజీ శోభా ఐజీకి షోకాజు నోటీసులు పంపారు. నిరాధార ఆరోపణలతో తన ఇమేజ్ను దెబ్బతీసేందుకు ఐజీ వికాశ్ ప్రయత్నించారని, ఆయన్ను ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించరాదో చెప్పాలని డీజీ శోభా తన షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.
డీజీ మేడం తిట్ల పురాణానికి చెందిన ఫోన్ రికార్డింగ్ తన వద్ద ఉందంటూ ఐజీ వికాశ్ పేర్కొన్నారు. అయితే ఆఫీసర్ వికాశ్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్‌ను ఉల్లఘించారని డీజీ శోభ తన నోటీసులో ఆరోపించారు. ప్రస్తుతం ఐజీ వైభవ్ రెండు నెలల లీవ్‌పై వెళ్లారు.