Hathras stampede : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవ్ ప్రకాశ్ మధుకర్ (Dev Prakash Madhukar) ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో హత్రాస్ జిల్లా ఎస్పీ నిపుణ్ అగర్వాల్ (Nipun Aggarwal) శనివారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు.
‘కేసులో ప్రధాన నిందితుడైన దేవ్ ప్రకాశ్ మధుకర్‌ను అదుపులోకి తీసుకున్నాం. అంతకుముందు అతనిపై లక్ష రూపాయల రివార్డు ప్రకటించాం. ఢిల్లీలోని నజఫ్గఢ్లో నిందితుడు పట్టుబడ్డాడు. అతడిని అరెస్ట్ చేసి హత్రాస్‌కు తీసుకొచ్చాం. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నది. సత్సంగ్ కార్యక్రమానికి విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. కేసును ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. విరాళాల సేకరణలో అవకతవకలుంటే వాళ్లు వదిలిపెట్టరు’ అని ఎస్పీ నిపుణ్ అగర్వాల్ చెప్పారు.
కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాశ్ మధుకర్.. నారాయణ్ సకార్ హరి అలియాస్ భోలే బాబాకు ప్రధాన సహాయకుడు. తొక్కిసలాటకు కారణమైన సత్సంగ్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది మధుకరే అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా హత్రాస్ తొక్కిసలాటలో మొత్తం 121 మంది ప్రాణాలు కోల్పోయారు.