న్యూఢిల్లీ, ఆగస్టు 20: చంద్రుడిపై ప్రయోగాలకు సంబంధించి తదుపరి చేపట్టబోయే చంద్రయాన్-4, 5 మిషన్ల రూపకల్పన పూర్తయిందని, ప్రభుత్వ అనుమతి తీసుకొనే ప్రక్రియలో ఉన్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రయాన్-4 ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి అక్కడి రాళ్లు, మట్టిని తీసుకురావడం లక్ష్యమన్నారు.
అదేవిధంగా రానున్న ఐదేండ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగించాలనే లక్ష్యంతో ఇస్రో ప్రణాళికలు వేస్తున్నదని తెలిపారు. 2028లో చంద్రయాన్-4 చేపట్టే లక్ష్యంతో ఉన్నామని అంతకుముందు ఇస్రో అధికారులు పేర్కొన్నారు.