న్యూఢిల్లీ, డిసెంబర్ 20 : ఇక నుంచి మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే తప్పనిసరిగా ‘సైబర్ క్రైమ్ అవగాహన’ కాలర్ ట్యూన్‌ను వినాల్సిందే. సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించుకుంది. దీంతో ప్రతి ఫోన్‌కు రోజుకు 8-10 సార్లు ఈ కాలర్‌ట్యూన్‌ను వినియోగదారులకు విన్పించాలని టెలికం శాఖ ద్వారా ఆపరేటర్లకు ఆదేశాలు జారీచేసింది. ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇచ్చే ఈ కాలర్ ట్యూన్లను మూడు నెలల పాటు విన్పించాలని, దీనిపై తక్షణం చర్యలు చేపట్టాలని హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైబర్‌క్రైం విభాగం ఆదేశించింది. కాగా, ఇటీవలి కాలంలో కొందరు సైబర్ నేరగాళ్లు అంతర్జాతీయ నకిలీ కాల్స్ ద్వారా వినియోగదారులను డిజిటల్ అరెస్ట్, కేవైసీ, లాటరీ, ఇన్సూరెన్స్ తదితరాల పేరుతో పెద్దయెత్తున మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో కేంద్రం నవంబర్ 15 వరకు 6.69 లక్షల సిమ్‌లను, 1,32,000 ఐఎంఈఐలను బ్లాక్ చేసింది.