లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మరో దైన్య పరిస్థితి వెలుగుచూసింది. రెండేళ్ల తమ్ముడి మృతదేహాన్ని పదేళ్ల బాలుడు తన చేతుల్లో మోశాడు. బాగ్పత్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది. ఏడుస్తున్న రెండేళ్ల కాలా కుమార్‌ను సవతి తల్లి సీత కదులుతున్న వాహనం కిందకు తోసేసింది. దీంతో ఆ బాలుడు మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆ మహిళను అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం కోసం బాలుడి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, పోస్ట్‌మార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని తండ్రి ప్రవీణ్‌కు అప్పగించారు. అయితే రోజువారీ కూలీ పనులు చేసుకునే అతడు 40 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి శవాన్ని తీసుకెళ్లే వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారులను కోరాడు. అయితే వారు పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక బాలుడి మృతదేహాన్ని చేతుల్లో మోసుకుని ఆసుపత్రి నుంచి గ్రామానికి బయలుదేరాడు.
కొంత దూరం నడిచిన తర్వాత తన వెంట ఉన్న పదేళ్ల కుమారుడు సాగర్‌కు బాలుడి మృతదేహాన్ని తండ్రి ఇచ్చాడు. దీంతో ఆ బాలుడు రెండేళ్ల తమ్ముడి మృతదేహాన్ని కొంత దూరం చేతుల్లో మోశాడు. దీనిని గమనించిన స్థానికులు తమ మొబైల్ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీశారు.
మరోవైపు ఈ విషయం ఆసుపత్రి అధికారులకు తెలిసింది. దీంతో వెంటనే స్పందించి మృతదేహం తరలించే వాహనాన్ని ఏర్పాటు చేశారు. కాగా, పదేళ్ల బాలుడు తన రెండేళ్ల తమ్ముడి మృతదేహాన్ని చేతుల్లో మోస్తూ నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP: Boy, 10, carries body of two-yr-old brother due to 'lack of vehicle'https://t.co/XZyxMq8dru pic.twitter.com/HPN18ev9Bq
— TOIWestUP (@TOIWestUP) August 29, 2022