Duvvuri Subbarao | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో ప్రతిపక్షానికి చోటు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యమనేది వర్ధిల్లుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. దేశంలో నెలకొన్న అసమానతలు, నిరుద్యోగం తనను ఎంతగానో ఆందోళనకు గురిచేస్తున్నట్టు చెప్పారు. తయారీ, సేవల రంగాల్లో పురోగతి సాధించామా? అన్నది పక్కనబెడితే, దేశంలో నిరుద్యోగం పెరిగిందన్న మాట వాస్తవమేనన్నారు. వాతావరణ మార్పులు, కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్ కారణంగా ఉద్యోగాల్లో కోత, ప్రపంచీకరణ తదితర అంశాలు రానున్న రోజుల్లో కొత్త సవాళ్లను తీసుకురావొచ్చని అన్నారు.
రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారడానికి ఇంకా చాలా సమయం పడుతుందని దువ్వూరి అన్నారు. ఇప్పటికీ, రూపాయి అమెరికన్ డాలర్‌కు బందీగానే ఉన్నదని గుర్తు చేశారు. విదేశీ మారకపు మార్కెట్లకు సంబంధించిన విషయాల్లో ఆర్బీఐ జోక్యం తగ్గించుకోవాలని సూచించారు.