న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో దేశంలో రాజకీయ వేడి పెరుగుతున్నది. రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ జెట్లు, విమానాలకు డిమాండ్ పెరుగుతున్నది. గత ఎన్నికల్లో కంటే ఈ సారి 40 శాతం డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
క్లబ్ వన్ ఎయిర్ సీఈవో రాజన్ మెహ్రా మాట్లాడుతూ, ప్రైవేట్ జెట్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు. చార్టర్డ్ ప్లేన్స్, హెలికాప్టర్ల లభ్యత కన్నా ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది హెలికాప్టర్లను లీజుకు తీసుకునే అవకాశం ఉన్నదని చెప్పారు. చార్టర్డ్ ప్లేన్కు గంటకు రూ.4.5 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు వసూలు చేస్తారు. హెలికాప్టర్‌కు గంటకు రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తారు. ఈ ధరలు డిమాండ్‌ను బట్టి పెరగవచ్చునని ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.