న్యూఢిల్లీ : దేశ రాజధాని కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఆదివారం కొత్తగా 3,194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 17శాతం ఎక్కువగా కేసులు రికార్డయ్యాయి. శనివారం 2,716 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ టెస్ట్ పాజిటివిటీ రేటు 4.59శాతంగా నమోదైందని ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజాగా కరోనా బారినపడి ఒకరు మృతి చెందగా.. ప్రస్తుతం ఢిల్లీలో 8,397 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా కేసులతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 14,54,121కి పెరిగింది. ఇప్పటి వరకు 14,20,615 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 25,109 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఢిల్లీలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3వేల మార్క్‌ను దాటుతుందని పేర్కొన్నారు. సీఎం పేర్కొన్నట్లుగా ఢిల్లీలో 3వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
క్రియాశీల కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ.. చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదని, కొందరిలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని, అయితే భయపడాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్ కేసుల సంఖ్య పెరిగినప్పటికీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ ఒకశాతం కంటే తక్కువగా ఉందని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.