న్యూఢిల్లీ: ఢిల్లీలో సోమవారం కారు పేలుడు(Delhi Car Blast) ఘటన జరిగిన విషయం తెలిసిందే. యూఏపీఏ చట్టం కింద ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. ప్రస్తుతం పలు ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని హై అలర్ట్‌లో ఉన్నది. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్, బస్ టర్మినళ్ల వద్ద బందోబస్తు పెంచారు. ఓ సీనియర్ పోలీసు అధికారి ప్రకారం.. కోత్వాలి పోలీసు స్టేషన్లో యూఏపీఏ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కూడా కేసులు బుక్ చేశారు.
యూఏపీఏలోని సెక్షన్ 16, 18 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో కదులుతున్న కారులో శక్తివంతమైన పేలుడు జరిగింది. ఆ పేలుడు ధాటికి రోడ్డు మీద ఉన్న వాహనాలు ధ్వంసం అయ్యాయి. 9 మంది మృతి చెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు. డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.